మూడో అంతస్తు మీదుగా మెట్రో రైలు.. చెన్నైలో అద్భుత మెట్రో ప్రాజెక్ట్.. తిరుమంగళం ప్రాజెక్ట్ ప్రత్యేకత ఇదే!
Thirumangalam Metro Project: పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) మరో కీలక అడుగు వేసింది. చెన్నై మెట్రో రెండవ దశ ప్రాజెక్టులో భాగంగా.. తిరుమంగళం మెట్రో స్టేషన్ సమీపంలో నాలుగు భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి రూ. 446.88 కోట్ల విలువైన కాంట్రాక్టును కెపాసైట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అప్పగించింది.
కారిడార్ 5 వెంబడి సుమారు 3.85 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అత్యంత వినూత్నమైన ఇంజనీరింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. మెట్రో రైలు ప్రయాణించే వయాడక్ట్ (పైవంతెన) నేరుగా ఈ భవనాల గుండానే వెళ్లేలా రూపకల్పన చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పనులు ప్రారంభమైన నాటి నుండి 24 నెలల కాలపరిమితిలో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సమీకృత నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. తిరుమంగళం మెట్రో స్టేషన్‌కు ఇరువైపులా నాలుగు వేర్వేరు టవర్లను నిర్మించనున్నారు. వీటిలో టవర్ ఎ, టవర్ సి భవనాలను మూడు బేస్‌మెంట్ స్థాయిలు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, తొమ్మిది పై అంతస్తులతో నిర్మిస్తుండగా.. టవర్ బి భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు తొమ్మిది పై అంతస్తులుగా తీర్చిదిద్దనున్నారు. ఇక టవర్ డి భవనం గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులను కలిగి ఉంటుంది. ఫేజ్-2 తిరుమంగళం మెట్రో స్టేషన్ సరిగ్గా టవర్ బి, టవర్ సి భవనాల మధ్యలో కొలువుదీరనుంది. ఈ తరహా నిర్మాణం వల్ల ప్రయాణికులు స్టేషన్ నుండి నేరుగా వాణిజ్య సముదాయాలకు, కార్యాలయాలకు సులభంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) రూపొందించిన 'ట్రాన్సిట్-ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్' (TOD) విధానానికి అనుగుణంగా CMRL ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. కేవలం టికెట్ల విక్రయాలపైనే ఆధారపడకుండా.. ప్రజా రవాణా కేంద్రాల చుట్టూ వాణిజ్య ఆస్తులను అభివృద్ధి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
అంతేకాకుండా, పాదచారులు, సైకిల్ తొక్కేవారికి అనుకూలంగా ఉండేలా విశాలమైన ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి మెట్రో వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి, సంస్థ ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుంది.
మరోవైపు చెన్నై మెట్రో సేవలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. అక్టోబర్ 2026 నెలలో ఏకంగా 1,08,23,408 మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యంగా అక్టోబర్ 16వ తేదీన ఒక్కరోజే 4,51,705 మంది ప్రయాణించడం విశేషం. మొత్తం ప్రయాణికులలో గ్రీన్, బ్లూ లైన్ల ద్వారా 1,02,40,136 మంది ప్రయాణించగా, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎల్లో లైన్‌ను 5,83,272 మంది వినియోగించుకున్నారు.
పూనమల్లి బైపాస్ నుండి పోరూర్ జంక్షన్ మీదుగా వడపళని మెట్రో స్టేషన్‌ను కలిపే 14.64 కిలోమీటర్ల ఎల్లో లైన్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. తిరుమంగళం వంటి ఆధునిక ప్రాజెక్టుల రాకతో చెన్నై నగర రవాణా ముఖచిత్రం మరింత వేగంగా మారనుంది.


Click it and Unblock the Notifications
