H-1B Visa: భారతీయులకు షాక్.. హెచ్ 1బీ వీసా గ్రేస్ పీరియడ్ రద్దు..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ దేశంలో ఉండే విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో నిబంధన తీసుకొస్తూ భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు పెంచారు. హెచ్-1బీ వీసాల విషయంలో భారత్ 71 శాతంతో అతిపెద్ద లబ్ధిదారుగా ఉందని చెబుతున్నారు. కేవలం 11.7 శాతం లబ్ధితో చైనా రెండోస్థానంలో ఉందని నిపుణులు తెలిపారు. ఫీజు పెంచడం ముఖ్యంగా ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం పడింది. అయితే ట్రంప్ ఫీజు పెంపు నిర్ణయాన్ని అక్కడి కోర్టు తప్పుబట్టింది. భారీ ఫీజును ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. దీంతో భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా ట్రంప్ మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనివిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో పని చేసే విదేశి ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే వెంటనే దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అతను కొత్త ఉద్యోగం సాధించడానికి సమయం ఇస్తారు. నిబంధనల ప్రకారం అతనికి 60 రోజుల సమయం ఇస్తారు. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. ఆలోగా అతనికి ఉద్యోగం దొరికితే అక్కడే ఉండొచ్చు. లేకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.

అయితే తాజా ప్రతిపాదన ప్రకారం 60 రోజుల గ్రేస్ పీరియడ్ తీసేస్తే ఉద్యోగులకు ఇబ్బందే. ఈ నిబంధన అమల్లోకి వస్తే.. అమెరికాలో పని చేసే ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే వెంటనే ఆ దేశాన్ని వీడాల్సి ఉంటుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను.. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉందని పేర్కొంటున్నారు. విదేశీ ఉద్యోగుల ఇబ్బందులతో 2017లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇది చాలా ఉపయోగపడేది. ప్రస్తుతం H-1Bతో పాటు E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి కొన్ని వీసా కేటగిరీలకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రేస్ పీరియడ్ తొలగించాలనే ప్రతిపాదన అమలులోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో H-1B వీసాల ద్వారా పనిచేస్తున్న వారిలో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో H-1B దరఖాస్తుల్లో భారతీయుల వాటా 71 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications