Prices: డబ్బును కాపాడుకోండి.. వచ్చే ఆరు నెలల్లో విపత్కర పరిస్థితులు రావచ్చు..!
దేశంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు కరువు మండలను ప్రకటించాయి. చాలా ప్రాంతాల్లో వర్షపాత లోటు కనిపిస్తోంది. దీంతో ఈసారి పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లి ధర భారీగా పెరిగింది. కిలో ఉల్లి రూ.80 పలుకుతుంది. ఉల్లిపాయల ధరలు 68.27 శాతం, బంగాళాదుంపల ధరలు 62.28 శాతం, టమోటా ధరలు 11.05 శాతం చొప్పున పెరగడంతో వంటింటి బడ్జెట్ పూర్తి అస్తవ్యస్తంగా మారింది.
జులైలో సీపీఐ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలలు సామాన్యూలకు ధరల మోత తప్పేలా లేదు. కూరగాయల ధరలు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిమాండ్ సరిపడ సరఫరా లేకుంటే.. భారీగా ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బియ్యం ధరల పెరుగుదలతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే కిలో బియ్యానికి రకాన్ని బట్టి రూ.15 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు అంతంత మాత్రంగానే ఉండడంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయని మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు.

రేషన్ బియ్యంతో సరిపెట్టుకోవాలని కొంత మంది భావిస్తున్నారు. అయితే మిగతా సరకుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కూరగాయల ధరలు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రం వంట నూనెల ధరలు తగ్గించినప్పటికీ.. భవిష్యత్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పెరిగింది. పరిస్థితి ఇలానే ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఫలితంగా ఈ ప్రభావం రవాణా రంగంపై పడుతుంది. దీంతో కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల ధలు భారీగా పెరుగుతాయి.
ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఫలితంగా లోన్లు తీసుకున్న వారు ఎక్కు వ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంటే వచ్చే ఆరు నెలలు బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు, నూనెలు, నిత్యావసర వస్తువులు, లోన్లపై వడ్డీలు పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి వచ్చే ఆరు నెలలు సామాన్యులు చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
