SBI: షెడ్ వేస్తే రూ.500 కోట్ల లోన్ ఇస్తారా.. ఎస్బీఐని ప్రశ్నించిన హైకోర్టు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.20 వేల కోట్లతో పరిశ్రమ పెడతామని 100 ఎకరాల భూమి పొందిన సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేవలం షెడ్డు నిర్మాణం చేయగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ కంపెనీకి రూ.500 కోట్ల రుణం ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి కేవలం షెడ్ నిర్మాణం చేస్తే రుణం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా అంత భారీ రుణాన్ని ఏ ప్రాతిపదికన మంజూరు చేశారో చెప్పాలని బ్యాంకుకు తలంటింది.
రుణం ఇచ్చే సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించకుండా పూచీకత్తుపైనే ఆధారపడినట్టు కనిపిస్తున్నదని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్ సిటీలో సెమ్ ఇండియా ఫ్యాబ్కు కేటాయించిన 100 ఎకరాల్లో పనులు ప్రారంభించకపోవడంతో 78 ఎకరాలను వెనకి తీసుకునేందుకు ప్రభుత్వం 2010లో జీవో 9 జారీ చేసింది. ఈ నేపథ్యంలో రుణ రికవరీ చర్యలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకుండా ఆదేశించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేశారు. భూమి స్వాధీన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 2011లో బ్యాంకు రుణం మంజూరు చేయడంపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.

భూమి స్వాధీనాన్ని సవాలు చేస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ, సంబంధిత పత్రాలన్నింటినీ సీబీఐ తరఫు న్యాయవాదికి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది. మూడు దశల్లో పెట్టుబడులు, ఎనిమిది వేల ఉద్యోగాల లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. 2006 ఫిబ్రవరి 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు దశల్లో మొత్తం 2.25 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుచేసి ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యంతో పెట్టుబడి పెట్టింది.
మొదటిదశలో అసెంబ్లింగ్, టెస్టింగ్, మారింగ్, ప్యాకింగ్ యూనిట్, రెండో దశలో చిప్ తయారీ, మూడో దశలో అత్యాధునిక సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో 2008 జూన్ 19, నవంబర్ 17 తేదీల్లో కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయి. 2009 మార్చి 21న జరిగిన బోర్డు సమావేశానికి కంపెనీ డైరెక్టర్ హాజరుకాలేదు. అదే ఏడాది జూలై 2న మరోసారి నోటీసు ఇవ్వగా, జూలై 18న కంపెనీ సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించలేదు. 78 ఎకరాల భూమిని వెనకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ సెమ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను 2023 మార్చి 20న హైకోర్టు కొట్టివేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications