ఎలక్టోరల్ బాండ్ల విషయమై సుప్రీం కోర్టు మరోసారి ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినట్లుగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు ఇవ్వలేదని సుప్రీం ఎస్బీఐని ప్రశ్నించింది. ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ చేసింది.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో ఏకీకృత ఎలక్టోరల్ బాండ్ల డేటాను ప్రచురించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుకు నోటీసు జారీ చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఎస్‌బీఐ నుంచి స్పందన కోరింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. ఎలక్షన్ కమీషన్ తన వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను షేర్ చేసింది. ఇది లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా అగ్రస్థానంలో ఉందని పేర్కొంది.

ఈసీ అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్కాన్ చేసి, డిజిటలైజ్ చేసిన తర్వాత, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఎన్నికల కమిషన్‌కు తిరిగి ఇవ్వాలని, అది మార్చి 17న సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తుందని ఆదేశించింది.
బాండ్ల వివరాల గురించి ECIకి SBI సమర్పించిన సమాచారం అసంపూర్తిగా ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ సమాచారంలో బాండ్ల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ లేదని గుర్తించింది. బాండ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాండ్లను రీడీమ్ చేసిన పార్టీల గురించి పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.
ఎలక్షన్ కమిషన్ సమర్పించిన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా-న్యూమరిక్ నంబర్‌లను ఎస్‌బిఐ వెల్లడించలేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చేసిన సమర్పణలను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
ఎస్‌బిఐ సమర్పించిన డేటా సక్రమంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ, న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు.


Click it and Unblock the Notifications