Laptop Licencing: ల్యాప్‌టాప్స్ సహా పలు ఎలక్ట్రానికి ఉత్పత్తుల దిగుమతులపై ఇటీవల భారత్ నిషేధం విధించింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఒత్తిడి తెచ్చినా తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా భారత్ వ్యవహరించాలంటూ అమెరికా అధికారులు తెరవెనుక లాబీయింగ్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. తదనంతరం ల్యాప్‌టాప్ లైసెన్సింగ్ విధానంపై ఇండియా వెనక్కు తగ్గినట్లు పేర్కొంది. దీంతో US ప్రభుత్వం సహా పలు కంపెనీల ఆందోళనకు తెరపడినట్లయిందని తెలిపింది.

రాయిటర్స్ ప్రకారం.. భారత్ పాలసీని ప్రకటించిన వెంటనే అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ తాయ్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు.
ఎటువంటి సంప్రదింపులు, ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం.. వ్యాపార రంగంలో అనిశ్చితిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. సుమారు 500 మిలియన్ డాలర్ల US వార్షిక ఎగుమతులకు ఇది సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. US కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే విధంగా భారత్ వ్యవహరించినట్లు కేథరిన్ ఆరోపించారు.
ఇదే సమావేశంలో మంత్రి గోయల్ కూడా కొన్ని ఆందోళనలను లేవనెత్తారు. న్యూఢిల్లీ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలను తెలియజేశారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భారత్ తన విధానాలు ప్రకటించిందన్నారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూనే, స్థానిక తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తేల్చి చెప్పారు.
దిగుమతి చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు మరియు సర్వర్‌ల కోసం ఆపిల్, డెల్ మరియు హెచ్‌పి వంటి సంస్థలు లైసెన్స్ పొందాలని భారత్ ఆగస్టులో నిబంధనలను విధించింది. ఈ చర్య దిగుమతులను పర్యవేక్షించడం కోసమేనని ప్రకటించింది. ఏడాది తర్వాత మరోసారి రివ్యూ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే తన నిర్ణయాల పట్ల వెనక్కి తగ్గని మోదీ సర్కారు వారాల వ్యవధిలోనే ఈ పాలసీని వెనక్కి తీసుకుని ఆశ్చర్యపరిచింది.


Click it and Unblock the Notifications