ATM Charges: ఏటీఎం కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ..!
ఏటీఎం ద్వారా పరిమితికి మించి విత్ డ్రా చేస్తే బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్‌లు, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ ద్వారా నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు) ఆదేశాలు జారీ చేసింది. ఏటీఎంలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు ? ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ఎంత ఛార్జీ పడుతుంది ? ఒకవేళ ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా అకౌంట్‌లో మాత్రం డబ్బులు కట్ అయితే ఏం చేయాలి ? ఇలాంటి విషయాలపై బ్యాంకులు కస్టమర్లకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
ఏటీఎంల ద్వారా డబ్బులు విత్ డ్రా, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్ల ద్వారా డబ్బులు తీసుకోవడం, యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా చేయడం వంటి అంశాలకు సంబంధించిన గతంలో వేర్వేరుగా ఉన్న నిబంధనలను ఒకే చోటకి తీసుకొచ్చింది. ఈ మేరకు నవంబర్ 27న కొత్త మాస్టర్ డైరెక్షన్ విడుదల చేసింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత సర్క్యులర్లను కొట్టేస్తూ, వాటిలోని నిబంధనలను ఒకే మార్గదర్శకంలో పేర్కొంది. అయితే ఈ కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. సాధారణంగా ప్రతి బ్యాంకు కస్టమరుకి నెలకు కొన్ని ఉచిత ఏటీఎం లావాదేవీల సదుపాయం ఉంటుంది. అయితే ఆ పరిమితి ఎన్ని లావాదేవీలకు ఉందో తెలియక చాలామంది అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ కీలక నిర్ణయం ప్రకటించింది.

ఒక నెలలో కస్టమర్ ఇప్పటికి ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉపయోగించుకున్నాడు ? ఇంకా ఎన్ని ఉచిత లావాదేవీలు మిగిలి ఉన్నాయి ? ఉచిత పరిమితి దాటితే తరువాత లావాదేవీకి ఎంత ఛార్జీ పడుతుంది? అనే వివరాలను బ్యాంకులు కస్టమర్లకు స్పష్టం చేయాలని ఆదేశించింది. అంటే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన విషయం తెలియకుండా అదనపు ఛార్జీలు పడకుండా బ్యాంకులు ముందుగానే అప్రమత్తం చేయాలని తమ ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం సేవింగ్స్ కస్టమర్లకు ఈ విధంగా ఉచిత లావాదేవీలు ఉన్నాయి.
మీ సొంత బ్యాంకు ఏటీఎంలో ప్రతి నెలా 5 ఫ్రీ విత్ డ్రాలు చేసుకోవచ్చు. ఇందులో డబ్బులు తీసుకోవడం మాత్రమే కాకుండా, బ్యాలెన్స్ చెక్ చేయడం కూడా లావాదేవీలుగా కూడా ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలో మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు ఉంటాయి. నాన్ మెట్రో నగర ప్రాంతాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి. అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయంలో మెట్రో నగర ప్రాంతాల కోసం ఇచ్చిన పరిమితులను కలిపి వేర్వేరుగా ఉపయోగించుకోలేరని గుర్తుంచుకోవాలి. మొత్తంగా ఉచిత లావాదేవీల సంఖ్య ఐదుకు మించకూడదని తెలుసుకోవాలి. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత మరోసారి ఏటీఎం ఉపయోగిస్తే బ్యాంకు ఛార్జీ వసూలు చేయవచ్చు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి అదనపు లావాదేవీకి గరిష్టంగా రూ.23 ఛార్జీ విధించవచ్చు. దీనికి వర్తించే పన్నులు అదనంగా ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications