భారత్ బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఉత్తరాదిలో వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో భారీ రుతుపవనాల వర్షాలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో లోటు వర్షపాతం వంటి వాతావరణ మార్పుల కారణంగా వరి ఉత్పత్తి దెబ్బతింది. అందుకే బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు. అయితే బాయిల్డ్ రైస్‌ని నిషేధం నుంచి మినహాయించారు. బియ్యం ఎగుమతి నిషేధంతో అమెరికాలో బియ్యం కొనుగోళ్లు పెరిగాయి.
అమెరికాలోని స్టోర్ల ముందు ఇండియన్స్, ఆసియా దేశాలకు చెందిన వారు క్యూ కట్టారు. దాదాపు చాలా స్టోర్లలో బియ్యం సంచులు మొత్తం అమ్ముడుపోయాయి. చాలా స్టోర్లు బియ్యం స్టాక్ లేవని బయట బోర్డు పెట్టారు. ఒహియో స్టేట్‌లోని మాసన్ పట్టణంలో భారతీయ ఉత్పత్తులను నిల్వచేసే దుకాణం యజమాని రేషన్‌ను అమలుపరిచారు. కస్టమర్‌లు తమ కొనుగోలును తలకు ఒక 20-పౌండ్ల బ్యాగ్ (9.07 కిలోలు) $24 ధరకే పరిమితం చేయాలని కోరారు.

జూలై 21న బాస్మతితో సహా అన్ని రకాల బియ్యం కొన్ని గంటల్లో అమ్ముడయ్యాయి. మేసన్‌లో భారతీయ బియ్యం ప్రముఖ విక్రేత మాట్లాడుతూ, నిల్వలు ఉన్నంత వరకు తాను విక్రయిస్తానని, ఇది ఒక రోజు కంటే ఎక్కువ ఉండదని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసియా జనాభా ఉన్న టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో బియ్యం ధరలు పెరిగింది. టెక్సాస్‌లోని ఒక కొనుగోలుదారు తాను 20 పౌండ్ల తెల్ల బియ్యాన్ని $34కి కొన్నానని చెప్పాడు.
అమెరికాలో బియ్యం ధరలు దాదాపు 11 శాతం పెరిగాయి. మూడేళ్ల క్రితం గోధుమ పిండి ఎగుమతిపై భారత్ ఆంక్షలు విధించడంతో తాము ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా 40% కంటే ఎక్కువగా ఉంది. ఇది 2022లో 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. భారత్ బియ్యం ఎగుమతులు 2022లో రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో భారత్ తర్వాత థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.
భారత్ బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అటు రష్యా కూడా ఆహారధాన్యాల ఒప్పందం నుంచి వైదొలిగింది. దీంతో గోధుమ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు భారత్ బియ్యం ఎగుమతిపై నిషేదం విధించడంతో బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత తగ్గుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications