Fibrebond: కంపెనీ అమ్మి ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు చెల్లింపు..
సాధారణంగా ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. కొన్ని కంపెనీలకు ఉద్యోగుల కన్నా ఆదాయాల మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎలాంటి మానవత్వం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారు. అయితే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇస్తుంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు భారీగా డబ్బులు ఇస్తోంది. కంపెనీ అమ్మగా వచ్చిన డబ్బును ఉద్యోగులకు పంచింది.
అమెరికాలోని లూసియానాకు చెందిన విద్యుత్ పరికరాల సంస్థ అయిన ఫైబర్ బాండ్‌ను 1.7 బిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ ఒప్పందం ద్వారా 540 మంది ఉద్యోగులకు మొత్తం 240 మిలియన్ డాలర్లు అందేలా మాజీ యజమాని గ్రాహం వాకర్ కృషి చేశారు. కంపెనీలో వాటాలు లేనప్పటికీ ఉద్యోగులు దాదాపు 443000 డాలర్లు అందుకుంటున్నారు. ఫైబర్ బాండ్ ను పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈటన్ 1.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ రూ.16,045 కోట్లు. ఇందులో ఉద్యోగులకు రూ. 2,265 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు గ్రాహం వాకర్ కొనుగోలు చేసిన కంపెనీకి షరతు విధించారు.

ఈ బోనస్ డబ్బులను జూన్ నుంచి ఉద్యోగులకు చెల్లిస్తున్నారు. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్ కు అర్హులు. అయితే 65 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు మినహాయింపు ఉంది. అయితే బోనస్ ప్రకటన వచ్చినప్పుడు ఉద్యోగులు ఎవరు దీన్ని నమ్మలేదు. కంపెనీ ప్రకటనతో 540 మంది కోటీశ్వరులు అయ్యారు. కాగా.. ఫైబర్‌బాండ్‌ను 1982లో వాకర్ తండ్రి క్లాడ్ వాకర్ స్థాపించారు. ఈ కంపెనీ ప్రారంభంలో టెలిఫోన్, విద్యుత్ పరికరాల కోసం ఉపయోగించే నిర్మాణాలను తయారు చేసేది. అయితే ఈ ఫ్యాక్టరీలో 1998లో అగ్నిప్రమాదం జరిగింది.
అదే కాకుండా డాట్ కామ్ పతనం, ఆర్థిక మందగమనంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. కష్ట సమయంలో ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320కి పడిపోయింది. కంపెనీ కష్టకాలంలో ఉన్నా ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించింది. ఆ తర్వాత కంపెనీ డేటా సెంటర్లు, ఏఐ (AI) డిమాండ్ కంపెనీని బిలియన్ డాలర్ల ఒప్పందం వైపు నడిపించింది. డేటా-సెంటర్ మౌలిక సదుపాయాలలో సుమారు $150 మిలియన్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ తలరాత మారింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు, ఎల్ఎన్జీ ఎగుమతి ప్రాజెక్టుల పెరుగుదలతో కంపెనీ భారీగా లాభపడింది. ఐదేళ్లలో ఫైబర్‌బాండ్ అమ్మకాలు దాదాపు 400% పెరిగాయి. అప్పటి నుంచి ఈ కంపెనీ పెద్ద కంపెనీలు దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఈ కంపెనీకి భారీగా చెల్లించి ఈటన్ కంపెనీ కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications