UPI Payments: యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన.. ఆ లావాదేవీలకు నో ఎండీఆర్..!
యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ఛార్జీలకు సంబంధించి ఎన్పీసీఐ స్పందించింది. యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై విధించే GST చిన్న వ్యాపారులపై భారాన్ని మోపుతుందని, డిజిటల్ చెల్లింపులను ఖరీదైనవిగా మారుస్తుందని మీడియాలోని కొన్ని వర్గాలు చేసిన ఆరోపణలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఖండించింది. ఇది వాస్తవం కాదని స్పష్టం చేసింది. MDR అనేది కేవలం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన P2M (కస్టమర్ నుంచి వ్యాపారికి జరిగే) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. రూ. 2,000 వరకు జరిగే లావాదేవీలకు ఎండీఆర్ ఉండదని.. వాటిపై జీఎస్టీ ప్రభావం కూడా ఉండదని ఎన్పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
యూపీఐ ద్వారా వ్యాపారులకు జరిగే లావాదేవీల పరిమాణంలో రూ. 2,000 వరకు ఉండే లావాదేవీలే 96 శాతానికి పైగా ఉంటాయని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనివల్ల, అత్యధిక శాతం UPI చెల్లింపులకు MDR వర్తించదు. తద్వారా ఎండీఆర్ పై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలకు రూ. 1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు ఎండీఆర్ చెల్లించాల్సిందే. కాబట్టి వారికి ఎండీఆర్ పై జీఎస్టీ సమస్య కూడా ఉండదు. అందువల్ల MDRపై GST వ్యాపారులపై అదనపు భారాన్ని మోపుతుందనే ఆందోళనలు నిరాధారమైనవని ఎన్పీసీఐ పేర్కొంది. అత్యధిక శాతం UPI లావాదేవీలు, చిన్న వ్యాపారులు దీనివల్ల ప్రభావితం కారని వివరించింది.

అంతేకాకుండా అవుట్‌పుట్ పన్ను బాధ్యతకు వ్యతిరేకంగా ఇన్‌పుట్ పన్నులను ఎలా సర్దుబాటు చేస్తారో, అదే విధంగా వ్యాపారి ఎండీఆర్ పై చెల్లించిన జీఎస్టీని వస్తువుల అమ్మకంపై చెల్లించాల్సిన GSTతో సర్దుబాటు చేస్తారని తెలిపింది. ఫలితంగా వ్యాపారులు తాము చెల్లించిన ఎండిఆర్ మొత్తంపై జీఎస్టీ భారాన్ని మోయాల్సిన అవసరం ఉండదని ఆ ప్రకటన తెలిపింది. కొత్త యూపీఐ విధానం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలపై (P2P) ఎటువంటి ప్రభావం చూపదు. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా, వ్యక్తుల మధ్య జరిగే అన్ని లావాదేవీలకు యూపీఐ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన వివరణలో పేర్కొంది.
ఎండీఆర్ అనేది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను లేదా రుసుము కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంతకు ముందే స్పష్టం చేసింది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ మరియు విస్తరణకు మద్దతుగా, బ్యాంకులు మరియు పేమెంట్ అప్లికేషన్ ప్రొవైడర్లతో సహా చెల్లింపు వ్యవస్థలో పాలుపంచుకునే సంస్థల మధ్య ఇది పంపిణీ చేయనున్నారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన P2M లావాదేవీలకు మాత్రమే 0.4 శాతం మేర నామమాత్రపు ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ ఎండీఆర్ బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలు, యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లతో సహా చెల్లింపు వ్యవస్థలోని భాగస్వాముల మధ్య పంచుకోనున్నారు.
రూ. 75,000, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఒక్కో లావాదేవీకి ఎండీఆర్ గరిష్టంగా రూ. 300గా పరిమితం చేశారు. రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, బీమా, ఇంధనం, వ్యవసాయ ఉత్పాదకాలు వంటి అత్యవసర, తక్కువ లాభదాయక రంగాలలో రూ. 2,000 దాటిన లావాదేవీలపై ప్రతి లావాదేవీకి రూ. 5 చొప్పున ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
