Edible Oil: స్వల్పంగా తగ్గిన వంట నూనెల దిగుమతి.. ధరలు పెరుగుతాయా..!
దేశంలో వంట నూనెల దిగుమతి స్వల్పంగా తగ్గింది. ఇండస్ట్రీ బాడీ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ప్రకారం అక్టోబర్‌తో ముగిసిన 2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశ వంట నూనెల దిగుమతులు స్వల్పంగా 1.6 శాతం తగ్గి 119.35 లక్షల టన్నులకు చేరుకున్నాయి. నవంబర్ 2023-జూలై 2024 కాలంలో వంట నూనెల దిగుమతులు 1,19,35,227 టన్నులుగా ఉన్నాయి. అదే 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో 1,21,22,711 టన్నులుగా ఉన్నాయి.
వంట నూనెల మార్కెటింగ్ సంవత్సరం నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. భారతదేశ వంటనూనెల డిమాండ్‌లో 50 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. SEA డేటా ప్రకారం నాన్-ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులు 1,32,242 టన్నుల నుంచి 1,88,955 టన్నులకు పెరిగాయి. ప్రస్తుత సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో కూరగాయల నూనెల (తినదగిన, తినలేని నూనెలు) మొత్తం దిగుమతి 121.24 లక్షల టన్నులుగా ఉంది.

ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 122.55 లక్షల టన్నులతో పోలిస్తే 1 శాతం తగ్గింది. 2023-24 చమురు సంవత్సరంలో (నవంబర్ 2023-జూలై 2024) మొదటి తొమ్మిది నెలల్లో ఇండియా 15,18,671 టన్నుల శుద్ధి చేసిన తినదగిన నూనెను దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఇదే కాలంలో దిగుమతి చేసుకున్న 16,40,960 టన్నులతో పోలిస్తే ఇది 7 శాతం తగ్గిందని ఇండస్ట్రీ బాడీ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ముడి ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులు 1 శాతం తగ్గి 1,04,81,751 టన్నుల నుంచి 1,04,16,556 టన్నులకు పడిపోయినట్లు వివరించింది. 2023-24 నూనెల సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో, మొత్తం పామాయిల్ దిగుమతులు 4 శాతం తగ్గి 68,45,097 టన్నులకు చేరింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 71,17,834 టన్నులుగా ఉంది. అయితే సాఫ్ట్ ఆయిల్ దిగుమతులు 50,04,877 టన్నుల నుంచి 50,90,131 టన్నులకు పెరిగాయి. ఇండియాకు ఇండోనేషియా, మలేషియా నుంచి ముడి పామాయిల్, బ్రెజిల్, అర్జెంటినా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్, రొమేనియా, అర్జెంటీనా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.


Click it and Unblock the Notifications