Indiramma Kutumba Bhima: ఉచితంగా రూ.5 లక్షల బీమా.. 19న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!
ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి పెద్దకు తప్పకుండా ఆర్థిక భద్రత ఉండాలి. అందుకే బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం కూడా బీమా సంబంధించి ప్రజల కోసం పలు బీమా పథకాలు తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలు తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా మంది వాటికి ప్రీమియం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోటి కుటుంబాలకు బీమా కల్పించేందుకు సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు బీమా అందించాలని నిర్ణయించింది.
ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ కుటుంబ బీమా పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని ప్రభుత్వం నేరుగా అందనుంది. ఈ పథకం ఫారంలో దరఖాస్తు సంఖ్యతో పాటు లబ్ధిదారుల పూర్తి వివరాలను పారదర్శకంగా నమోదు చేసేలా కాలమ్స్ ఉంది. కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ ఎంపిక ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ ఫారాన్ని డిజైన్ చేశారు. దరఖాస్తు ఫారం మొదటి భాగంలో ప్రదేశ వివరాలు కింద లబ్ధిదారుల నివాస ప్రాంత సమాచారాన్ని కోడ్లతో సహా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇందులో జిల్లా, శాసనసభ నియోజకవర్గం పేరుతో పాటు వాటికి సంబంధించిన ప్రత్యేక కోడ్లను పొందుపరచాలి. నివాస ప్రాంతాన్ని గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించగా, గ్రామీణ ప్రాంతాల వారు మండలం, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ, వార్డు కోడ్లతో పాటు వీధి పేరు, ఇంటి నంబరు రాయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, జోన్, సర్కిల్, వార్డు కోడ్లు, వీధి పేరు, ఇంటి నంబరు వివరాలను పూర్తిగా ఫిల్ చేయాలి. వీటితో పాటు లబ్ధిదారుడికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) నంబరు కలిగి ఉంటే దానిని నమోదు చేయడంతో పాటు కులం, మతం వివరాలను నిర్ణీత కోడ్ల రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం రెండో విభాగంలో బీమా దారుడి వివరాలు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక పట్టికలను ఇచ్చారు.
ఈ పథకంతో పాటు రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. సిద్ధిపేట సభలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం చీరలను వెంటనే అన్ని జిల్లాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ బీమా పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications