Cheyutha Pensions: రేపటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ.. 4.5 లక్షల మందికి లబ్ధి..!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4.5 లక్ష పింఛన్లు మంజూరు చేసింది. పెన్షన్ మంజూరు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి దీపావళి రోజు లబ్దిదారులకు అందించారు. ఆ తర్వాత జిల్లాల్లో పింఛను మంజూరు పత్రాలు అందజేస్తారని చెప్పారు. కానీ ఎక్కడా కూడా కొత్త పెన్షన్ మంజూరు పత్రాలు జారీ చేయలేదు. కొత్త పింఛన్లకు సంబంధించి ఓ అధికారిని సంప్రదించగా నవంబర్ 19 తర్వాత ఎవరికి పెన్షన్లు వస్తాయో కాన్ఫమ్ అవుతాయని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం రేపటి నుంచి అంటే నవంబర్ 12 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మంజూరు చేసిన చేనేత పింఛన్లను ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
దరఖాస్తుదారుల పెండింగ్ వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు నియోజకవర్గాలవారీగా మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అలర్ట్ గా లేరు. కింది స్థాయిలో అధికారులకు కొత్త పింఛన్లపై అవగాహన లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి ప్రక్రియ మొదలు పెడతారా లేక నవంబర్ 19 వరకు ఆగాల్సి ఉందో చూడాలి.

కాగా రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గత తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత మళ్లీ కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో చాలా మంది పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అగస్ట్ 15 కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పారు. కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత దసరాకు అన్నారు. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో దీపావళికి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు.
పింఛన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. వార్డు, గ్రామ సభలు, ఆధార్ సీడింగ్ చేశారు. వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వితంతువుల నుంచి 3,31,236 దరఖాస్తులు రాగా దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 4.5 లక్షల మందిని తొలి విడత పింఛన్ల కోసం ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 40.44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మంజూరైన 4.5 లక్షల కొత్త పింఛన్లను కలిపితే రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షలకు చేరింది. దీంతో ప్రభుత్వం ఆర్థిక భారం పడినా.. పింఛన్లు అందిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లలో దాదాపు 3 లక్షలు వితంతువుల పింఛన్లు, ఒంటరి మహిళలు ఉన్నట్లు తెలిసింది. అలాగే లక్ష మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్ మంజూరు చేశారు. మరో 50 వేల మంది చేనేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications