LPG Gas: ఎల్పీజీకి బదులుగా ఇథనాల్.. కేంద్రం కీలక నిర్ణయం..!
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నారు. ఈ పెట్రోల్ వాడకంపై విమర్శులు వస్తున్నా.. కేంద్రం మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఎల్పీజీకి బదులుగా ఇథనాల్ వంట ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇథనాల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రజలు డబ్బాల్లో ఇథనాల్ కొనుగోలు చేసి ఎల్పీజీకి బదులుగా దీన్ని వాడొచ్చని చెబుతున్నారు. అయితే ఇథనాల్ వాడేందుకు ప్రత్యేక డిజైన్ చేసిన స్టౌలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. ఇథనాల్ ఉత్పత్తి 2 వేల కోట్ల లీటర్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,400 కోట్ల లీటర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దేశీయ అవసరాలకు 1,400 - 1,500 కోట్ల లీటర్లు ఉపయోగిస్తున్నారు. మిగిలిన దాదాపు 700 కోట్ల లీటర్ల అదనపు ఇథనాల్ ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా మిగులుతున్న ఇథనాల్‌ను సొంత ఉత్పత్తి లేని నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్చలు జరుపుతోంది.

అంతేకాకుండా విమానయాన రంగంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీకి ఇథనాల్‌ను ముడిసరుకుగా వాడేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం విశాఖపట్నంలో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, జీపీఎస్ రెన్యూవబుల్స్ కలిసి దేశంలోనే తొలి ఇథనాల్ టు జెట్ ఫ్యూయల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. గతంలో ఇథనాల్ అంటే కేవలం చక్కెర పరిశ్రమ ఉప ఉత్పత్తిగా భావించేవారు. కానీ ఇప్పుడు మొక్కజొన్న, ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఇథనాల్ లో ధాన్యాల ద్వారా తయారు చేసిన ఇథనాల్ ఎక్కువగా ఉంది.
ఇక పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ ను పెంచే అవకాశం లేదు. ఎందుకంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. అందుకే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20 శాతం (ఈ20) కంటే పెంచే ఆలోచన ఇప్పుడేమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. ఆటోమొబైల్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో సైంటిఫిక్ చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ20 ఇంధనం వల్ల ఇంజన్లు పాడవుతున్నాయనే వార్తల్లో నిజం లేదని, వాహనదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications