Mobile Apps: 3,718 మొబైల్ యాప్స్ బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే..!
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. తాజాగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు మోసపూరిత యాప్స్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది. జూన్ 30 నాటికి చట్టవిరుద్ధమైన, మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో ప్రకటించింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. 2021లో ప్రారంభమైన సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా ఇప్పటివరకు 32.80 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
వీటి ఆధారంగా తీసుకున్న చర్యలతో రూ.11,158 కోట్లకు పైగా మోసపూరిత నష్టాన్ని నివారించగలిగినట్లు లోక సభలో ప్రకటించింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఎ, 79(3)(బి) కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టినట్లు లిఖితపూర్వక సమాధానంలో బండి సంజయ్ పేర్కొన్నారు. పోలీసు అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎంఎస్‌లు, కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియోతో పాటు పాఠశాలలు, సినిమాలు, సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించింది. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో I4C 2024 సెప్టెంబర్‌లో 'సస్పెక్ట్ రిజిస్ట్రీ'ని కూడా ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి 30.48 లక్షలకు పైగా అనుమానిత ఐడెంటిఫైయర్లు, 32.08 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ ఖాతాల వివరాలను సంబంధిత సంస్థలతో ఇచ్చిపుచ్చుకున్నట్లు పేర్కొంది.
ఈ వ్యవస్థ ద్వారా జూన్ 30, 2026 నాటికి రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయగలిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఏకరీతిగా నిర్వహించేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్-సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసినట్లు గుర్తు చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications