UPI: యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జ్.. అదీ రూ.2 వేలు దాటితేనే..!
యూపీఐ చెల్లింపులు భారతదేశంలో భారీ మార్లు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) 2016 ఏప్రిల్ 11న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్శ్(UPI) అందుబాటులోకి తెచ్చింది. అయితే మొదట్లో యూపీఐని ఎక్కువగా వాడలేదు. అయితే నోట్ల రద్దు తర్వాత యూపీఐ పేమెంట్స్ క్రమంగా పెరిగాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం, భీమ్ యాప్ రాకతో యూపీఐ పేమెంట్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఎక్కడా చూసిన యూపీఐ పేమెంట్లే చేస్తున్నారు. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద పెద్ద మాళ్ల వరకు కూడా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు. రూ.5 యూపీఐ చేస్తున్నారు.
యూపీఐ పేమెంట్లకు ఎలాంటీ ఛార్జీ లేకపోవడం వల్ల ఇష్టమొచ్చినట్లు పేమెంట్ చేస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పెద్ద షాపుల్లో జరిగే యూపీఐ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై వచ్చే 15 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం.. రూ.2వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఈ ఎండీఆర్ వర్తించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఎండీఆర్ ఛార్జీ గరిష్ఠంగా 0.5 శాతం కంటే తక్కువగా ఉండేలా నిర్ణయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయబోరని, కేవలం పెద్ద వ్యాపారులు, సంస్థలపైనే వర్తింపజేయాలనే ఆలోచన ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రజలు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ఎండీఆర్ లేదు.
ప్రస్తుతం యూపీఐ మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చును బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు భరిస్తున్నారు. యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతున్న కొద్దీ సర్వర్లు, భద్రతా వ్యవస్థలు, సాంకేతిక నిర్వహణ, కొత్త టెక్నాలజీ అభివృద్ధికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే ఆదాయ వనరు అవసరమనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇప్పటికే రూ.2వేల వరకు జరిగే చిన్న విలువ గల యూపీఐ లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థ భాగస్వాములకు ప్రోత్సాహకాలను ఇస్తుంది.పార్లమెంట్ స్థాయి ఆర్థిక సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో జీరో ఎండీఆర్ విధానం వల్ల యూపీఐ వ్యవస్థ ఆర్థికంగా స్థిరంగా కొనసాగడం కష్టమవుతోందని చెప్పింది.
వచ్చే 5 సంవత్సరాల్లో యూపీఐ వినియోగదారుల సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే నెలకు 100 నుంచి 150 బిలియన్ పేమెంట్స్ జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications