BMTC: బెంగళూరు వాసులకు షాక్.. భారీగా పెరగనున్న బస్సు ఛార్జీలు..!
కర్ణాటక ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బస్సు ఛార్జీలు పెంచాలని.. ఇందుకు సంబంధించి ఆమోదం కోరుతూ రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(BMTC) 44 శాతం, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KSRTC) 33 శాతం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు పంపాయి. డీజిల్ ధరలు పెరగడంతో పాటు ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ట్రాన్స్ పోర్ట్ సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది.
ఆర్థిక భారం నుంచి సంస్థ బయట పడాలంటే బస్సు ఛార్జీల పెంచడమే మార్గమని రవాణా సంస్థలు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్ టికెట్ ధరలు పెంచకపోతే ప్రభుత్వ రవాణా రంగంపై భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం వల్ల ప్రజా రవాణాపై భారం పడుతుందని చెబుతున్నారు. శక్తి పథకం కింద కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల సంస్థలకు వచ్చే బకాయిలు పెరిగాయి. అంతేకాకుండా ఉద్యోగులు వేతన సవరణలు, నిర్వహణ వ్యయాలు కూడా పెరిగాయి.

అందుకే బస్సు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేశాయి. ప్రతిపాదనలు తన దృష్టికి వచ్చాయని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర నివేదికను కోరినట్లు వివరించారు. ఇంధన వ్యత్యాసాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మార్కెట్ డీజిల్ ధరలు, రవాణా సంస్థల డిపోలోని డీజిల్ ధరల మధ్య తేడా ఉందన్నారు. అయితే బస్సు ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దని పేర్కొన్నారు.
గతంలో డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఛార్జీల పెంపు ఉండేదని.. ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని.. ప్రజా రవాణా ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు సీఎం గుర్తు చేశారు. రవాణా సంస్థల ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా చూడాలి. మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. కాగా హైదరాబాద్ లో సిటీ బస్సుల ఛార్జీలను కొద్ది నెలల కింద పెంచిన సంగతి తెలసిందే.
ఉచిత ప్రయాణం వల్ల ప్రయోజనం ఉండదని పలువురు చెబుతున్నారు. కొంత మంది ఉచితం కదా అని ఇష్టమొచ్చినట్లు బస్సుల్లో తిరుగుతున్నారని.. దీని వల్ల సాధారణ ప్రజానీకం బస్సుల్లో నిలుచుని వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీనికి బదులుగా మహిళలకు కొంత రాయితీ ఇస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications