Bengaluru: బెంగళూరు వాసులకు షాక్.. భారీగా పెరిగిన బస్ ఛార్జీలు..!
కర్ణాటక ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థల బస్సు ఛార్జీలను పెంచింది. ఈ కొత్త ఛార్జీలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో సగటున 23 శాతం, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (BMTC)లో 33 శాతం నుంచి 35 శాతం వరకు ఛార్జీలు పెంచాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతుల్ కుమార్ తివారీ నేతృత్వంలోని 'పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫేర్ రెగ్యులేటరీ కమిటీ' (PTFRC), మూడు రవాణా సంస్థలకు 25 శాతం, BMTCకి 40 శాతం ఛార్జీల పెంపును సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పీటీఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన 45 శాతం పెంపుతో పోలిస్తే ప్రస్తుతం అమలు చేసిన పెంపు తక్కువగానే ఉంది. ఈ నాలుగు సంస్థల బోర్డులు 90 శాతం వరకు ఛార్జీలను పెంచాలని కోరినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం తక్కువ స్థాయిలోనే పెంచింది. బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ సాధారణ బస్సుల్లో రెండు కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఛార్జీ రూ. 4, రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు రూ. 6 చొప్పున పెరిగాయి. గరిష్టంగా రూ. 12 వరకు పెంచారు. కెంపెగౌడ బస్ స్టేషన్ నుంచి శివాజీనగర్‌కు వెళ్లే ఛార్జీ రూ. 12 నుంచి రూ. 18కి, బనశంకరికి వెళ్లే ఛార్జీ రూ. 23 నుంచి రూ. 35కి పెరిగింది.

ఎయిర్ కండిషన్డ్ 'వజ్ర' (Vajra) సర్వీసుల్లో 6 కిలోమీటర్ల వరకు రూ. 5, ఆరు నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ. 10, గరిష్టంగా రూ. 15 వరకు ఛార్జీలు పెరిగాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి హెబ్బాల్‌కు వెళ్లే ఛార్జీ రూ. 55 నుంచి రూ. 65కి పెరిగింది. ధరలు పెంచినప్పటికీ ఈ సంస్థలు నష్టాల్లోనే ఉంటాయని ఈ పెంపు ద్వారా నష్టాలను దాదాపు 25 శాతం వరకు తగ్గించవచ్చని రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఈ రవాణా సంస్థలు మొత్తం 26,125 బస్సులను నడుపుతున్నాయి. వీటిలో 1,02,646 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 1.24 కోట్ల మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తుండగా, వారిలో సుమారు 74.40 లక్షల మంది మహిళలు 'శక్తి' పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
ఛార్జీల పెంపు సాధారణ, ఎక్స్‌ప్రెస్, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, విమానాశ్రయ సర్వీసులన్నింటికీ వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణ దూరానికి అనుగుణంగా KSRTC సాధారణ బస్సు ఛార్జీలు గరిష్టంగా రూ. 9 వరకు పెరగనున్నాయి. గతంలో జనవరి 2025లో ఛార్జీలను సవరించినప్పుడు KSRTC, నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC) సంస్థలు 33 శాతం పెంపును, అలాగే BMTC సంస్థ 42 శాతం పెంపును కోరాయని.. అయితే ప్రభుత్వం 15 శాతం పెంపునకు మాత్రమే ఆమోదం తెలిపింది.
డీజిల్ ధరల పెరుగుదల, విడిభాగాలు, బస్సుల నిర్వహణ వ్యయం పెరగడం, అలాగే రవాణా సంస్థల ఉద్యోగుల వేతన సవరణ అవసరం వంటి కారణాల వల్ల ఈ ఛార్జీల పెంపు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ నాలుగు రవాణా సంస్థలకు కలిపి ఏటా సుమారు రూ. 2,000 కోట్ల నష్టం వస్తోందని, సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు ఛార్జీలను సవరించడం అవసరమని రవాణా శాఖ మంత్రి చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications