హోల్‌సేల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోందిగా: అంచనాలకు మించి
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. రిటైల్‌తో పాటు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ భారీగా పెరిగింది. ఏప్రిల్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. మే నెలలో ఇది మరింత పైకి ఎగబాకింది. దీనికి సంబంధించిన లెక్కలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.
ఏప్రిల్‌లో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 15.8 శాతంగా నమోదు కాగా.. మే నాటికి భారీగా పెరిగింది. 15.88 శాతానికి చేరింది. గత సంవత్సరం అంటే 2021 మే నెలతో పోల్చుకున్నా కూడా ఈ సంఖ్య ఎక్కువే. గత ఏడాది మే నెలలో నమోదైన డబ్ల్యూపీఐ 13.11 శాతమే. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి పైకెళ్లి కూర్చుంది. 15.88 శాతంగా నమోదైంది.
కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రైస్ (సీసీఐ)కి సంబంధించిన గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మరుసటి రోజే దీన్ని ప్రకటించింది. సీపీఐ 7.04 శాతంగా చూపించింది సంబంధిత మంత్రిత్వ శాఖ. ఏప్రిల్‌లో కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రైస్ 7.79 శాతంగా నమోదైంది. ఇది 95 నెలల గరిష్ఠం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇప్పుడు తాజాగా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా అదే దారిలో నడుస్తోంది. తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. 2013లో డబ్ల్యూపీఐ 15 శాతానికి పైగా నమోదైంది. ఇప్పుడు దాన్ని అధిగమించింది. మే నెలలో దాదాపు అన్నింటి ధరలు పెరగడమే దీనికి కారణమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తోన్నారు.
కొన్ని నెలలుగా వంటనూనెలు, పప్పు దినుసులు.. ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. వంటనూనెల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న సందర్భాలు లేకపోలేదు. ఏది ముట్టుకున్నా షాక్ కొట్టేంత స్థాయికి ధరలు చేరుకున్నాయి. టమోటా ఇతర కూరగాయల రేట్లు సైతం అదే స్థాయిలో ఉంటోన్నాయి.
దీనివల్ల మే నెలలో డబ్ల్యూపీఐ అంచనాలకు మించి పెరిగిందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే పరిస్థితి జూన్‌లో కూడా ఉండొచ్చని అంటున్నారు. ఈ నెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ జులైలో వెల్లడవుతుంది. కాగా.. ఏప్రిల్‌లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఇదివరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 ఉండేది.


Click it and Unblock the Notifications