Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. రాయితీపై నిత్యావసర వస్తువులు..!
నిత్యావవస వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం రాయితీపై నిత్యావసర వస్తువులు అందించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యంతో పాటు, మరో ఆరు రకాల నిత్యావసర సరుకులను అందించేందుకు కసరత్తు చేస్తోంది. సన్న బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, చింతపండు, కారంపొడి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు రాయితీపై నిత్యావసర వస్తువులు అందించనుంది.
క్రిస్మస్, సంక్రాంతి పండగలను దృష్టిలో పెట్టుకుని రేషన్ షాపుల ద్వారా కార్డులు ఉన్నవారికి కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున త్వరలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకే సన్న బియ్యం విక్రయిస్తోంది. సీఎం చంద్రబాబు నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, రాయితీపై ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేసి నిర్ణయం కూడా తీసుకున్నారు. డిసెంబర్ నెల నుంచి మూడు నెలలపాటు రాయితీపై నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ వస్తువులు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం నెలకు రూ.100.20 కోట్ల భారం పడనుంది. మూడు నెలలకు రూ.300.60 కోట్లు రాయితీ భారాన్ని భరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి కింద 1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఈ మేరకు 40,338 టన్నులు కేటాయించింది. ముడికందుల లభ్యతకు అనుగుణంగా సేకరణతో పాటుగా పప్పు తయారీ ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీని పౌరసరఫరాలశాఖ కమిషనర్ కన్నబాబు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే పామాయిల్ సేకరించాలని, మూడు నెలల తర్వాత రాయితీపై నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని పొడిగించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో వివరించారు. సరకులపై రాయితీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications