Poultry India Expo 2026: తెలుగు పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో..
18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026లో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది. ఇందులో 120 దేశాల నుంచి 51 వేల మందికి పైగా పౌల్ట్రీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నాయని నిర్వహకులు తెలిపారు.
ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పీ.సింగ్ బఘేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని నిర్వహకులు పేర్కొన్నారు.
పౌల్ట్రీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలపై నిపుణులు చర్చించనున్నారు. కోళ్ల ఆరోగ్యం, శాస్త్రీయ పోషకాహారం, దాణా నిర్వహణ, టీకా విధానాలు, ఆటోమేటెడ్ కోళ్ల పెంపకం కేంద్రాలు, కృత్రిమ మేధ (ఏఐ), సుస్థిర ఉత్పత్తి విధానాలపై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించనున్నారు. మూడు రోజుల ఎక్స్పోలో కోళ్ల పెంపకం పరికరాలు, హేచరీలు, దాణా తయారీ యంత్రాలు, ఫార్మ్ ఆటోమేషన్, వెంటిలేషన్ వ్యవస్థలు, వెటర్నరీ వైద్యం, వ్యాధి నిర్ధారణ, గుడ్ల ప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఆధునిక సాంకేతికతను ప్రదర్శించనున్నారు.

దేశంలో పౌల్ట్రీ రంగం ఆహార భద్రత, పోషకాహారం, గ్రామీణ ఉపాధిలో కీలక పాత్ర పోషిస్తోందని నిర్వహకులు తెలిపారు. ఈ రంగంపై ఆధారపడి రైతులు, వ్యాపారవేత్తలు, అనుబంధ పరిశ్రమల్లో సుమారు 50 నుంచి 60 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. 2023-24లో భారత్ 142.77 బిలియన్ గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో రెండో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచిందని వివరించారు. కోళ్ల మాంసం ఉత్పత్తిలోనూ ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని చెప్పారు. కాగా ఐపీఈఎంఏ 20కి పైగా అంతర్జాతీయ పౌల్ట్రీ సంఘాలు, 40 జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
గత ఎక్స్పోలో 500కు పైగా సంస్థలు, 51,251 మంది పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రదర్శనలు జరిగాయి. ఈసారి ఏడు హాళ్లలో 550కి పైగా సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఎక్స్పో ద్వారా దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆదరణ, అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నట్లు ఐపీఈఎంఏ-పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బాయస్ చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications