కరోనా దెబ్బకు కుదేలైన వస్త్ర పరిశ్రమ .. సూరత్ క్లాత్ ఇండస్ట్రీకి భారీ నష్టం
కరోనా లాక్ డౌన్ తో వస్త్ర పరిశ్రమ కుదేలైంది. నిత్యం కోట్ల వ్యాపారం జరిగే వస్త్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ దెబ్బకు మూత పడింది. ఎక్కడా ఎలాంటి వస్త్ర వ్యాపారాలు కొనసాగాక పోవటంతో చిన్న షాపు మొదలుకుని పెద్ద పెద్ద షో రూమ్ ల వరకు నష్టాలను మూట కట్టుకున్నాయి. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా 200 కంటెయినర్లలో పత్తి నూలు చైనాకు ఎగుమతి అయ్యేది. కరోనా కారణంగా పత్తి నూలు ఎగుమతి నిలిచి పోయింది. ఇక వస్త్ర పరిశ్రమ కూడా పూర్తిగా పీకల్లోతు కష్టాలలోకి వెళ్ళింది .

వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడిన జనాలు దేశ వ్యాప్తంగా కోట్లలోనే
కరోనా లాక్ డౌన్ తో వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి కూడా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. ఇంకా ఉన్న స్టాక్ కూడా రవాణా చెయ్యలేని , షాపుల్లో అమ్ముడుపోని పరిస్థితి . ఇక వస్త్ర వ్యాపారం కోలుకోవటం ఈ సంవత్సరం సాధ్యం కాదని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వాలు రాయితీలు , లోన్లు ఇచ్చి పారిశ్రామిక వర్గాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి దేశ వ్యాప్తంగా కోట్లలో జనాలు బ్రతుకుతున్నారు.

కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న వస్త్ర పరిశ్రమ
అలాంటి వారంతా ఇప్పుడు పరిశ్రమలు కరోనా లాక్ డౌన్ దెబ్బతో దివాలా తీస్తే రోడ్డున పడే పరిస్థితి . కాబట్టి వారందరికీ జీవనోపాధి దక్కాలంటే వస్త్ర పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూరత్ వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి సూరత్ లోని వస్త్ర పరిశ్రమలు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల సూరత్ వస్త్ర పరిశ్రమల రంగానికి రూ.1000కోట్ల నష్టం వాటిల్లింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు .

సూరత్ వస్త్ర వ్యాపారానికి రూ.1000కోట్ల నష్టం
సూరత్ వస్త్ర వ్యాపారం ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంటుంది. చాలా మంది వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు సూరత్ నుండే స్టాక్ తెప్పించుకుంటారు. అలాంటిది కరోనా లాక్ డౌన్ తో ఆ ప్రొడక్షన్ , ఇటు సప్లై రెండూ నిలిచిపోయాయి. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వస్త్రపరిశ్రమకు వెయ్యికోట్లరూపాయల నష్టం వాటిల్లిందని దక్షిణ గుజరాత్ టెక్స్ టైల్స్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీతూభాయ్ వఖారియా చెప్పారు. దేశంలో లాక్ డౌన్ ను కొనసాగించనున్న నేపథ్యంలో వస్త్ర పరిశ్రమల రంగానికి వచ్చిన నష్టం ఇంకా పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు .

రాయితీలిచ్చి ప్రభుత్వాలు ఆదుకోవాలని వినతి
సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయి. కరోనా వల్ల సూరత్ తోపాటు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ లో కూడా హౌజౌరీ రంగం సంక్షోభంలో పడింది. ఇక వస్త్ర పరిశ్రమలే కాదు , చిన్నా పెద్దా తేడా లేకుండా హోల్ సేల్ , రిటైల్ వ్యాపారాలు చేసే వారు సైతం ప్రస్తుతం వ్యాపారాలు చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమలను కాపాడటానికి రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications