భారీ రిటర్న్స్ ఇచ్చిన టెస్లా, ఏడాదిలో 700% జంప్: జెఫ్ బెజోస్‌ను దాటివేసే దిశగా ఎలాన్ మస్క్
టెస్లా కంపెనీ షేర్లు అంతకంతకూ ఎగిసిపడుతున్నాయి. 2020 క్యాలెండర్ ఏడాదిలో టెస్లా స్టాక్స్ భారీ లాభాలు నమోదు చేయడంతో గత నెల నాటికి ఈ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 160 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. 49 ఏళ్ల మస్క్ అందరు బిలియనీర్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఆర్జించారు. జనవరిలో బ్లూమ్‌బర్గ్ ప్రకటించిన ప్రపంచ 500 మిలియనీర్లలో అతను 35వ స్థానంలో ఉన్నాడు. కొద్ది నెలల క్రితం టాప్ 10లోకి వచ్చాడు. నవంబర్ నెలలో టాప్ 3కి, ఆ తర్వాత 2వ స్థానంలోకి వచ్చాడు.

700 శాతం జంప్
గత శుక్రవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద 9 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది మస్క్ సంపద 140 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇక టెస్లా షేర్‌కు ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లో స్థానం లభించనుందనే వార్తలతో ఆ స్టాక్ నవంబర్ నెల నుండి భారీగా పెరుగుతోంది. ఈ కాలంలోనే 70 శాతం పెరిగింది. ఇక ఏడాదిలో 700 శాతానికి పైగా పెరిగింది.
టెస్లాకు చెందిన 80 శాతం షేర్లు ట్రేడ్‌కు అందుబాటులో ఉన్నాయి. టెస్లా సూచీ ఇండెక్స్‌లో 1.5 శాతం వెయిటేజీ కలిగి ఉంటుంది. ఏడాది ప్రారంభంలో 86 డాలర్ల వద్ద ఉన్న టెస్లా షేర్ నవంబర్ మిడ్ నాటికి 400 డాలర్లకు పైన ఉంది. ఇప్పుడు 695 డాలర్ల వద్ద ఉంది. చివరి సెషన్లో దాదాపు 6 శాతం పెరిగింది.

నెంబర్ వన్ ఆటో మేకర్
టెస్లా ప్రధానంగా ఎలక్ట్రిక్ కారు మేకర్. అత్యదిక వ్యాల్యూ కలిగిన కంపెనీ. గత గురువారం నాటికి టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 621.73 బిలియన్ డాలర్లుగా నమోదయింది. టయోటా మోటార్ కార్ప్ మార్కెట్ క్యాప్ కంటే 25 బిలియన్ డాలర్లు ఎక్కువ. కరోనా సమయంలో కొన్ని కంపెనీలు భారీగా లాభపడ్డాయి. ఇందులో ఈ-కామర్స్ సంస్థలు ముందున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టెస్లా స్టాక్స్ కూడా పుంజుకోవడం గమనార్హం. ఇందుకు స్పేసెక్స్, ఎస్ అండ్ పీ ఎంట్రీ ప్రధాన కారణం.

మొదటి స్థానానికి వచ్చే అవకాశం
ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తులు 187.3 బిలియన్ డాలర్లు. ఎలాన్ మస్క్ ఆయన సమీపానికి చేరుకున్నాడు. మరో 20 బిలియన్ డాలర్లు పెరిగితే జెఫ్ బెజోస్‌ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంటారు. విద్యుత్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా భవిష్యత్తు మరింత బాగుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications