Tesla: ఇండియాకు రానున్న టెస్లా ప్రతినిధులు.. EV మార్కెట్‌లో వాటా కోసం పక్కా ప్రణాళికతో..
Tesla: ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో అగ్రగామిగా కొనసాగుతోంది. కానీ ఆ కంపెనీ వాహనాలు రోడ్లపైకి వచ్చి దశాబ్దం దాటినా ఇప్పటికే ఇండియాలో కాలుమోపలేదు. దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఒక్క 2022లోనే 223 శాతం పెరుగుదల నమోదు కావడంతో.. మరోసారి ఒప్పందంపై టెస్లా పునరాలోచనలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 5 కార్ల తయారీదారులే ఇంత పెద్ద మొత్తంలో వృద్ధి సాధించడంతో మస్క్ కన్ను ఇండియన్ EV పరిశ్రమపై పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర బ్రాండ్ల మాదిరిగానే చైనా వెలుపల తయారీ మరియు సరఫరా గొలుసును విస్తరించాలని టెస్లా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ వారం ఇండియాను సందర్శిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం టెస్లా ఉన్నతాధికారులు ప్రధాని మోడీ కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ ప్రతినిధులను కూడా కలవనున్నట్లు సమాచారం.
భారత్‌లో టెస్లా కార్లను అసెంబ్లింగ్ చేయడానికి, పెరుగుతున్న EV మార్కెట్ లో బ్రాండ్ అడుగుపెట్టడానికి, ఈ కార్ల తయారీలో ఉపయోగించే వస్తువులను స్థానికంగా తయారు చేయాలనే ఆలోచనతో ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నట్లు వినికిడి. ప్రపంచ స్థాయిలోని ఎలక్ట్రిక్ వాహన సంస్థ, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌తో జతకట్టడం అటు టెస్లాతో పాటు భారత ప్రభుత్వానికీ విన్-విన్ అవకాశమని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications