Piyush goyal: ఎలాన్ మస్క్ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ఆయన సంపద. ప్రపంచ కుబేరుల జాబితాలో మెుదటి స్థానంలో కొనసాగుతున్న ఆయన తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పటం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.
భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నాలుగు రోజుల పర్యటన కోసం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోయల్ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్ అక్కడ లేరు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్క్ క్షమాపణలు చెప్పారు.

టెస్లా ఫ్యాక్టరీని సందర్శించిన తర్వాత.. పీయూష్ గోయల్ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో టెస్లా అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సందర్శించినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ స్థానాల్లో పని చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. వారు కంపెనీ పురోగతికి, అద్భుతమైన ప్రయాణానికి దోహదపడడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
EV సరఫరా గొలుసులో భారతదేశం నుంచి ఆటో కాంపోనెంట్స్ సరఫరాదారుల పెరుగుతున్న ప్రాముఖ్యతను చూసి టెస్లా కూడా గర్వపడుతుందన్నారు. టెస్లా భారత్ నుంచి కార్ల తయారీకి అవసరమైన కాంపోనెంట్ దిగుమతులను రెట్టింపు చేసే ట్రాక్‌లో ఉందని పీయూష్ గోయల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఎలాన్ మస్క్ స్పందించటం గమనార్హం.
టెస్లా ఫ్యాక్టరీ సందర్శనకు మీరు రావటాన్ని గౌరవంగా భావిస్తున్నానంటూ మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ క్రమంలో తాను కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమించాలని, భవిష్యత్తులో కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications