Elon Musk: ఇండియాకు టెస్లా సీఈవో.. ప్రధాని మోదీతో మంతనాలు.. మ్యాటర్ ఏటంటే..
PM Modi: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ విక్రయంలో అందరికంటే ముందు వరుసలో ఎలాన్ మస్క్ టెస్లా ఉన్న సంగతి తెలిసిందే. మార్పును ముందుగానే గమనించిన మస్క్ తన టెస్లా కార్లతో ఈవీ ప్రియులను ఆకట్టుకున్నారు.
అయితే చాలా కాలంగా తన ఎలక్ట్రిక్ కార్లను భారత రోడ్లపై కూడా తిప్పాలని మస్క్ చూస్తున్నారు. 120 కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఇప్పటికే పలుమార్పు ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ధృవీకరించారు.

ఇండియాలో ఎలాన్ మస్క్ పర్యటన ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మస్క్ మొదటి భారతదేశ పర్యటన. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఎదురు చూస్తున్నానంటూ మస్క్ తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 'వైబ్రెంట్ గుజరాత్' ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పటి నుంచి మస్క్ భారతదేశ పర్యటన గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ పర్యటనలో మస్క్ భారతదేశంలోని తయారీ కర్మాగారం స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని గురించి మస్క్ లేదా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే ప్రధాని మోదీ-మస్క్ రెండుసార్లు భేటీ అయ్యారు. 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీలో తొలిసారి వీరు కలవగా.. రెండోసారి జూన్ 2023లో న్యూయార్క్‌లో కలుసుకున్నారు. ఊహాగానాల ప్రకారం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనీట్ కోసం కంపెనీ స్థలం పరిశీలిస్తోందని.. ఇందుకోసం రూ.16-రూ.25 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తోందని వెల్లడైంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కర్మాగారం కోసం బృందం దృష్టిని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి ఆటోమోటివ్ హబ్ రాష్ట్రాలపై ఉండొచ్చని తెలుస్తోంది. పైగా అక్కడి ఓడరేవుల నుంచి కార్ల ఎగుమతి సులభరంగా ఉంటుందని తెలుస్తోంది. టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థలను తయారు చేసి విక్రయించాలనుకుంటోంది. దీని కోసం కంపెనీ భారత అధికారులకు ప్రతిపాదన చేసింది.


Click it and Unblock the Notifications