Elon Musk: మోదీకి ఫ్యాన్ అన్న ఎలాన్ మస్క్.. వాటిని ఇండియాకు తెచ్చే ప్రయత్నం..
Modi US Tour 2023: ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న ప్రధాని మోదీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ను కలిశారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టెస్లా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పైగా తాను భారత ప్రధాని మోదీకి అభిమానినని మస్క్ అన్నారు.
టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఉందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. టెస్లా భారతదేశంలో ఉంటుందని.. వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేస్తామని విశ్వసిస్తున్నట్లు ఎలాన్ మస్క్ బదులిచ్చారు. అలాగే వచ్చే ఏడాది ఇండియాను సందర్శించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ సహకరానికి ధన్యవాదాలు తెలుపుతూ సమీప భవిష్యత్తులో ఏదైనా ప్రకటన చేయవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సౌర శక్తి, స్థిర బ్యాటరీ ప్యాక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా స్థిరమైన ఇంధన భవిష్యత్తు కోసం భారతదేశానికి బలమైన సామర్థ్యం ఉందని మస్క్ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ భారత అభివృద్ధిపై నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు కొనియాడారు.
స్పేస్‌ఎక్స్ యజమాని మస్క్ తన స్టార్ లింక్ సేవలను భారతదేశానికి విస్తరించటం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరువ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల స్పేస్ ఎక్స్ ప్రతినిధులు భారత టెలికాం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిగినట్లు టెక్ క్రంచ్ కథనంలో పేర్కొంది. దీనికి ముందు 2021లో స్టార్ లింక్ సంస్థ తన వ్యాపారాన్ని భారతదేశంలో రిజిస్టర్ చేసుకుంది. అయితే కమర్షియల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించటానికి అనుమతులు మంజూరు కాలేదు.


Click it and Unblock the Notifications