ఐఎండీ అలర్ట్.. మరో మూడు రోజులు నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్‌లో అర్థరాత్రి దంచి కొట్టిన వాన..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఒకవైపు భానుడి భగభగలు, వడగాడ్పులతో జనం అల్లాడిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు వాతావరణాన్ని క్షణాల్లో మార్చేస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరాన్ని అర్ధరాత్రి పలకరించిన భారీ వర్షం నగరవాసులకు ఊరటనివ్వగా, తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత, ఆంధ్రాలో రికార్డు స్థాయి వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అప్పటివరకు ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులను ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలకరించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అయితే, పగటిపూట 42.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో నిప్పుల కుంపటిలా మారిన నగరానికి, ఈ వర్షం రాత్రి వేళల్లో చల్లదనాన్ని మోసుకొచ్చింది. బుధ, గురువారాల్లో కూడా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలో ఇలాంటి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్‌లో వర్షం కురిసినప్పటికీ, తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మాత్రం ఎండల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు. మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్రమైన ఎండల నేపథ్యంలో 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
అలాగే కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. పగటిపూట తీవ్రమైన ఎండలే కాకుండా, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతూ 'వార్మ్ నైట్' (వేడి రాత్రులు) పరిస్థితులు కొనసాగుతుండటం ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. అయితే, మే 28 (గురువారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు రుతుపవన (ప్రీ-మాన్‌సూన్) జల్లులు ప్రారంభమై, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ ఊరటనిచ్చే వార్త చెప్పింది.
అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సమాచారం ప్రకారం, రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 48.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని జనాలను వణికించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని సుమారు 125 మండలాల్లో తీవ్రమైన వడగాలులు (Severe Heat Wave) వీస్తున్నాయి. గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 47.3 డిగ్రీల చొప్పున నిప్పుల వర్షం కురుస్తోంది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని సుమారు 68 మండలాల్లో బుధవారం కూడా తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ, నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని హెచ్చరించారు.
ఒడిశా నుండి ఉత్తర కోస్తా ఆంధ్రా వరకు విస్తరించి ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావంతో చిత్తూరు, పార్వతీపురం మన్యం వంటి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, కోస్తా ఆంధ్రాలో మాత్రం రాబోయే రెండు రోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుంది.


Click it and Unblock the Notifications
