Karnataka Water Crisis: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే అమీర్ పేట్ ట్రైనింగ్ అవ్వగానే అటు బెంగళూరు వెళ్లి టెక్ పరిశ్రమలో ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవుతున్న వారి సంఖ్య గత దశాబ్థకాలంగా విపరీతంగా పెరిగింది.
అయితే అవకాశాలతో పాటే అడ్డంకులు కూడా ప్రజలకు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా బెంగళూరులో ప్రజల పొందుతున్న ఉపాధి ఆదాయాలు అక్కడి ఖర్చులు తినేస్తున్నాయనే వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రధానంగా విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలకు తోడు నగరంలోని ట్రాఫిక్ సమస్యలు.. ఇటీవల పెరిగిన పిల్లల స్కూల్ ఫీజులు ఇలా చెప్పుకుంటూ పోతే వంటగది నుంచి ఆరోగ్యం వరకు అన్ని ఖర్చులు అక్కడ పెరిగిపోయాయి. సామాన్యులకు అక్కడ నివసించటం పెద్ద కలగా మారిపోతోంది. ఇప్పుడు తెలుగు ఫ్యామిలీలను వెంటాడుతున్న మరో సమస్య నీటి ఎద్దడి.

ప్రధానంగా బెంగళూరు చరిత్రను పరిశీలిస్తే దశాబ్ధానికి పైగా ఎక్కువ ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ భూగర్భజలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది వేసవి నుంచి సమస్యలు జఠిలంగా మారటంతో ప్రజలకు నీటి ట్యాంకర్ల రూపంలో కూడా కొత్త ఖర్చులు స్టార్ట్ అయ్యాయి. తాజాగా శివరాత్రి కూడా ముగియటంతో.. వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్నందున బెంగళూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల తాగునీటి సరఫరా గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి పారుదల బోర్డు వేసవి కాలంలో నగరంలోని 1.30 కోట్లకు పైగా ప్రజల తాగునీటి సరఫరాకు హామీ ఇవ్వటం కొంత ఊరటను కలిగిస్తోంది.
అయితే ప్రజలు ఈ క్రమంలో తాగు నీటిని కార్ వాషింగ్, గార్డెనింగ్ సహా ఇతర అవసరాలకు వృధా చేయెుద్దని నిషేధాజ్ఞలు జారీ చేసింది. నీటిని వృధా చేసినందుకు రూ.5,000 జరిమానా విధించింది. ఈ నియమాన్ని పాటించనివారిపై ఇటీవల 112 కేసులు నమోదు చేసి దాదాపు రూ.5.6 లక్షలు వసూలు చేసినట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. వేసవి తీవ్రమయ్యే ఏప్రిల్ మరియు మే నెలల్లో పరిస్థితిని పరిష్కరించడానికి బోర్డు చర్యలు తీసుకుంటుండగా బోర్‌వెల్స్‌లో.. ముఖ్యంగా బయటి ప్రాంతాలలో నీరు తగ్గిపోవడంపై నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కువగా ప్రైవేటు వాటర్ ట్యాంకుల దయపై ఆధారపడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
బెంగళూరు అర్బన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. రామనగర జిల్లాలో ముఖ్యంగా మాగడి తాలూకాలో 2.75 లక్షల జనాభా నీటి సమస్యలను ఎదుర్కొంటున్నందున తీవ్ర ఆందోళన నెలకొంది. హేమావతి నది నుంచి నీటిని లిఫ్టు చేసే ప్రాజెక్ట్ అయిన ఎక్స్‌ప్రెస్ కెనాల్‌ను నిర్మించడం ద్వారా తాలూకాలోని నీటి సమస్యను పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే హెచ్‌సి బాలకృష్ణ అన్నారు. ఇదే క్రమంలో బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి సమస్య అలాగే కొనసాగుతున్నందున పరిస్థితులు ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. మెుత్తానికి బెంగళూరులోని ప్రజలకు ఈ వేసవి కూడా ఖరీదైనదిగా ఉండనుందని తెలుస్తోంది. ప్రజలు దీనికి సిద్ధంగా ఉండాల్సిందే మరి.


Click it and Unblock the Notifications