Reliance Jio: అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నేడు తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రంగంలోని ఇతర కంపెనీలు మనుగడకోసం అష్టకష్టాలు పడుతుండగా.. జియో మాత్రం స్థిరంగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది.
జనవరి-మార్చి త్రైమాసికంలో అంబానీ టెలికాం వెంచర్ నికర లాభం రూ.5,337 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.4,716 కోట్ల కంటే 13.17 శాతం అధికమని కంపెనీ తన ఫలితాల్లో నేడు వెల్లడించిండి. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.25,959 కోట్లుగా నిలిచింది. ఇదే సమయంలో కంపెనీ ఖర్చులు 10.2 శాతం వృద్ధి చెందాయి.

కంపెనీ మొత్తం ఆస్తులు మార్చి 31, 2024 నాటికి రూ.4,87,405 కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకు ముందు ఏడాది కాలంలో రూ.4,45,772 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభాల మార్జిన్ గత ఏడాది ఇదే కాలంలో 17.1 శాతంతో పోలిస్తే క్యూ4 FY24లో 17.5 శాతానికి మెరుగుపడింది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలకు తన 5జీ సేవలను వేగంగా రోలౌట్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇదే క్రమంలో వైర్‌లెస్, వైర్‌లైన్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడం కొనసాగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
బ్రోకరేజ్ ప్రభుదాస్ లిల్లాదర్ కంపెనీలు సైతం కంపెనీ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ సగటు రూ.182గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ వివరాలను కంపెనీ రేపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర రూ.2,962.90 వద్ద ట్రేడింగ్ ముగించింది. అలాగే కంపెనీ షేర్ ధర 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 14.39 శాతం మేర పెరిగింది. ఇదే క్రమంలో బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 23 శాతం పెరుగుదలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications