చైనా వెండర్స్ హువావే, జెడ్‌టీఈలు లేకుండానే టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 5 ట్రయల్ పరీక్షల కోసం అదనపు దరఖాస్తులను దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రాజెక్టులో అయినా చైనాకు చెందిన కంపెనీలు ఉంటే అది సెక్యూరిటీ పరంగా ఇబ్బందికర పరిణామమని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా వెండర్స్ పేర్లు లేకుండానే ఈ రెండు టెలికం దిగ్గజాలు అదనపు దరఖాస్తులు చేసుకోవచ్చునని చెబుతున్నారు. దీనిపై భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు హువావే, జెడ్‍టీఈ స్పందించాల్సి ఉంది.

హువావే, జెడ్‍టీఈలు భాగస్వాములుగా..
5జీ ట్రయల్స్ కోసం తమ భాగస్వామిగా హువావే, జెడ్‍టీఈ ఉన్నాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. బెంగళూరు, కోల్‌కతాలలో అవి తమ పార్ట్‌నర్స్‌గా పేర్కొంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ భాగస్వాములుగా నోకియా, ఎరిక్సన్‌లను కూడా పేర్కొన్నాయి. అయితే భద్రతాపరమైన కారణాలతో చైనా కంపెనీలను పక్కన పెడుతున్నందున ఈ టెలికం ఆపరేటర్స్ అదనపు దరఖాస్తులు సమర్పించనున్నాయి. ఇందులో ఆ చైనీస్ వెండర్స్‌ను భాగస్వామిగా పేర్కొనకుండా అప్లికేషన్స్ ఇస్తాయని భావిస్తున్నారు.

భారతీ ఎయిర్‌టెల్ క్లియర్
భారత్ - చైనా మధ్య సరిహద్దుపరమైన వివాదం కొనసాగుతున్నందున భద్రతాపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు... ప్రాజెక్టుల్లో చైనీస్ కంపెనీలను చేర్చడంపై భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాము చైనీస్ వెండర్స్ లేకుండా అదనపు దరఖాస్తులు దాఖలు చేస్తామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా అదే మార్గంలో నడవనుందని భావిస్తున్నారు.

ఈ అదనపు దరఖాస్తుతో..
ప్రస్తుత దరఖాస్తులకు అదనంగా మరోసారి దరఖాస్తు చేసుకుంటాయని, ఇందులో చైనీస్ కంపెనీలు ఉండవు కాబట్టి 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం ప్రభుత్వం దీనిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు మరింతగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, 5జీ పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పెక్ట్రంను కేటాయించలేదు.


Click it and Unblock the Notifications