Vodafone Idea: VI రూ.18,000 కోట్లు సమీకరణ.. సూపర్ రెస్పాన్స్.. షేర్ల పరిస్థితి ఇదే..
Vodafone Idea FPO: భారతీయ టెలికాం రంగంలో భారీ పోటీ నెలకొంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు మార్కెట్లో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియాలు ప్రధాన ప్రేయర్లుగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో పోటీని తట్టుకుని ముందుకు సాగేందుకు విఐ భారీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా.. వొడాఫోన్ ఐడియా 74 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. పెట్టుబడిదారుల్లో అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన GQG పార్టనర్స్‌తో పాటు.. ది మాస్టర్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్, యూబీఎస్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఆస్ట్రేలియన్ సూపర్, ఫిడిలిటీ, క్వాంట్, మోతీలాల్ ఓస్వాల్ ఉన్నారు.

టెలికాం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.11 చొప్పున 491 కోట్ల షేర్లను కేటాయించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన మొత్తం షేర్లలో 26 శాతం US-ఆధారిత GQG పార్టనర్స్ రూ.1,345 కోట్లకు కొనుగోలు చేసింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎఫ్‌పీవోలో దాదాపు రూ.772 కోట్లు పెట్టుబడి పెట్టింది. ట్రూ క్యాపిటల్ రూ.331 కోట్లు, ఆస్ట్రేలియన్ సూపర్ రూ.130 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. మెుత్తం 5 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందులో పాల్గొని పెట్టుబడి పెట్టాయి. కంపెనీ తాజా ఫలితాలతో షేర్లు మార్కెట్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో 3వ స్థానంలో ఉన్న టెలికాం ఆపరేటర్ భారతదేశపు అతిపెద్ద ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇది ఏప్రిల్ 18న ప్రారంభమవుతుంది. అలాగే పబ్లిక్ ఆఫర్ ప్రైస్ బ్యాండ్ ధర రూ.10-11గా ప్రకటించగా అది ఏప్రిల్ 22న ముగుస్తుంది. తాజాగా సేకరిస్తున్న మూలధనంలో రూ.12,750 కోట్లను కంపెనీ కొత్త 4G సైట్‌ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న 4G సైట్‌ల సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు కొత్త 5G సైట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తన నెట్‌వర్క్‌ను బలపరుకునేందుకు వినియోగించాలని నిర్ణయించింది. పైన పేర్కొన్న మెుత్తంలో రూ.5,720 కోట్లను టెలికాం తన 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు వెచ్చించనుంది. FY25లో రూ.2,600 కోట్లతో 10,000 కొత్త 5G సైట్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అలాగే FY26లో రూ.3,120 కోట్లతో 12,000 5G సైట్‌లను ఏర్పాటు చేయనుంది.


Click it and Unblock the Notifications