Jio-Airtel కొత్త ప్లాన్స్.. ఇకపై అనవసరంగా డేటా కోసం డబ్బు చెల్లించక్కర్లేదు..!
Jio Vs Airtel: భారతదేశ టెలికాం రంగంలో ప్రస్తుతం కొన్ని కంపెనీలు మనుగడ కోసం పోరాడుతుంటే.. మరికొన్ని మాత్రం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా ప్రయోజనం పొందుతోంది మాత్రం యూజర్లేనని కొంత మేరకు చెప్పుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే రిలయన్స్ జియో భారతీయ టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి మొబైల్ ఫోన్ కస్టమర్‌లు రీఛార్జ్ చేసినప్పుడు డేటాతో కూడిన బండిల్డ్ ప్లాన్‌లను మాత్రమే పొందుతున్నారు. చాలా మంది తమ ఇంట్లో వైఫై ఉండటం, కొందరు అసలు డేటా ఉపయోగించని పరిస్థితులు ఉన్నప్పటికీ వాయిస్ కాల్స్ కోసం తప్పనిసరిగా ఎక్కువ ధర చెల్లించి డేటాతో కూడిన ప్లాన్స్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశాలతో కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టాయి.

ఈ క్రమంలోనే ట్రాయ్ ఆదేశాల మేరకు టాప్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు డేటా లేని రీఛార్జ్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ముందుగా రిలయన్స్ జియో 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్‌లతో కూడిన ప్యాక్ రూ.458కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో జియో సినిమా, జియో టీవీ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. అలాగే 365 రోజుల కాలానికి రూ.1,958 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇది అపరిమిత కాల్స్, 3600 ఎస్ఎమ్ఎస్‌లను అందించనుంది.
ఇదే క్రమంలో జియోతో పోటీలో ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఎయిర్‌టెల్ కూడా రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ముందుగా 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ రూ.509కి విక్రయిస్తోంది. ఇది ఉచిత అపరిమిత కాల్స్, 900 SMSలను ఈ కాలంలో అందిస్తుంది. అలాగే ఏడాది కాలానికి ప్యాకేజీని రూ.1,999కి అందిస్తోంది. ఇందులో వాయిస్ కాల్స్ తో పాటు 300 ఎస్ఎమ్ఎస్ లను అందించనున్నట్లు ప్రకటించింది. ఇవి కేవలం మెుబైల్ కాల్స్ కోసం రీఛార్జ్ చేసే యూజర్లకు డబ్బు ఆదా చేస్తాయి.
TRAI అసలు ఏం చెప్పింది..?
చాలా మంది వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యపై గతఏడాది చివరిలో ట్రాయ్ టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డేటాను ఉపయోగించని కస్టమర్ల ప్రయోజనం కోసం వాయిస్ కాల్ మాత్రమే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని అన్ని కంపెనీలకు సూచించింది. ఈ క్రమంలోనే తాజాగా టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్లను రోలౌట్ చేశాయి.


Click it and Unblock the Notifications