Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
Telcos Tariffs: దేశంలోని మొబైల్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇది ముగిసిన అనంతరం కస్టమర్లకు వాత పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మరోసారి టారిఫ్‌లు పెంచేందుకు టెల్కోలు ఎదురు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2001లో దాదాపు 20 నుంచి 25 శాతం పెంచగా.. ఇప్పుడు మరో 15 శాతం వడ్డించేందుకు పావులు కదుపుతున్నాయి. జియో మరియు ఎయిర్‌టెల్ తమ 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో వినియోగదారుల నుంచి ఆర్జించే సగటు ఆదాయం(ARPU)లో మంచి వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు.

కొంతమంది 15 శాతం పెంపును అంచనా వేస్తుండగా.. వచ్చే సంవత్సరంలో 20 శాతానికి చేరవచ్చని లెక్కలు వేస్తున్నారు. 2025-26 నాటికి ఎయిర్‌టెల్ ARPU రూ. 260కి చేరి ముందంజలో ఉంటుందని బెర్న్‌స్టెయిన్ తెలిపారు. ఇదే తరహా వ్యూహాన్ని జియో కూడా అమలు చేస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఎన్నికల తర్వాత స్థిరమైన పనితీరు మెరుగుపడి లాభాలు ఆశించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే త్రైమాసికాల్లో రిలయన్స్ జియో కూడా టారిఫ్ రేట్లను పెంచవచ్చని JP మోర్గాన్ నివేదించింది. దీని ద్వారా గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ చర్య పెద్ద మొత్తంలో స్టాక్ ధరను పెంచుతుందని వెల్లడించింది. 2025-26 నాటికి 11 నుంచి 12 శాతం వరకు పెరుగుదల నమోదవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ARPU పరంగా చూస్తే ఎయిర్‌టెల్ రూ.208, జియో రూ.182, వీఐ 145 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications