ఫ్లాండర్స్ తో తెలంగాణ ఒప్పందం.. జీవశాస్త్ర పరిశోధనల్లో కొత్త అధ్యాయం ఆరంభం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా వెలుగొందుతోంది. ఎన్నో పేరెన్నికగల సంస్థలు, స్టార్టప్ లు.. హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అభివృద్ధికి ఆస్కారమున్న ప్రతి రంగంలోనూ రాష్ట్రం దూసుకుపోతోంది. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్ విభాగాన్ని మరింత ప్రోత్సహించడానికి బెల్జియంకు చెందిన ఫ్లాండర్స్ ప్రాంతంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేతులు కలిపింది.

లైఫ్ సైన్సెస్ బలోపేతమే లక్ష్యంగా..
తెలంగాణ స్థాయిని అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌లో మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం బెల్జియంలోని శక్తివంతమైన ప్రాంతం ఫ్లాండర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్లు, లైఫ్ సైన్సెస్ రంగంలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా వారితో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది.
mRNA సాంకేతికత, ఇమ్యునోథెరపీ, లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వంటి కీలక అంశాల్లో పరస్పరం సహకరించుకోవడానికి నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఇరువురికీ ప్రయోజనకరం
"అభివృద్ధి, నూతన సాంకేతికత, పరిశోధనల్లో.. తెలంగాణతో సమానంగా ఎదుగుతున్న ఫ్లాండర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. జీవశాస్త్ర పరిశోధనల్లో తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాం. ఈ ఒప్పందం ఇరు ప్రాంతాల సమిష్టి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది" అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

అంతర్జాతీయ సదస్సులకూ హాజరు
టీకాలు, సాంకేతికత, ఇంజనీరింగ్ విభాగాల్లో.. ఫ్లాండర్స్ కు ఉన్న నైపుణ్యాన్ని మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం కలుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తద్వారా రెండు ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుకు మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. మొదటి దశలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న 'మార్క్యూ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ - 20వ ఎడిషన్'లో ఫ్లాండర్స్ పాల్గొంటుందని ప్రకటించారు. బయోఏషియా తదుపరి మూడు ఎడిషన్లలోనూ 'ఇంటర్నేషనల్ రీజియన్ పార్టనర్'గా వ్యవహరిస్తుందని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సన్నాహాలు
'ఫ్లాండర్స్ ఇన్వెస్ట్ మెంట్ & ట్రేడ్'కు చెందిన సీనియర్ అధికారుల బృందం.. ఈనెల 24న జరగనున్న బయోఏషియా 2023తో పాటు పలు ఇతర సమావేశాలకు హాజరవుతారని ప్రకటన వెల్లడించింది. తెలంగాణలో బయోఏషియా, ఫ్లాండర్స్‌లో నాలెడ్జ్ ఫర్ గ్రోత్ అనే ఈ రెండు కార్యక్రమాల్లో ఇరు ప్రాంతాలకు చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ నిపుణులు పాల్గొంటారని పేర్కొంది. వీరితో ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, రాబోయే నాలుగేళ్లలో భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకోనున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications