వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం మాట్లాడారు.. జపాన్‌లోని కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేయుచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాగా రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ ఆందోళనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పడింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జాతీయ జీడీపీకి తెలంగాణ వాటాను ప్రస్తుత ఐదు శాతం నుండి 2047 నాటికి 10 శాతానికి పెంచుతామని అన్నారు. పారదర్శక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. 2047 నాటికి తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

ఈ లక్ష్యాలను సాధించడానికి, పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల విధానం, పెట్టుబడి విధానాలను ప్రవేశపెట్టారు. దేశంలో సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణను దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగానే 'తెలంగాణ రైజింగ్-2047' భవిష్యత్తు ప్రణాళికను సిద్థం చేస్తోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. వాటిని నెరవేర్చే ప్రయత్నాలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకెళుతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు గమ్యస్థానంగా మన తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి పలు చర్యలు చేపట్టినట్లు సీఎం రేవంత్ చెప్పారు. మూసీ పునరుజ్జీవ పథకం, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు విస్తరణ ప్రణాళిక, విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలను సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధనం, పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడులు మరియు ఆరోగ్యం వంటి అనేక విధానాలను ప్రవేశపెట్టిందని సీఎం అన్నారు.
2047 నాటికి కేంద్ర జిడిపికి రాష్ట్రం అందించే వాటాను 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.యువత మన భవిష్యత్తు అని, అందుకే తమ ప్రభుత్వం 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలు అందించిందని సీఎం పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్నామన్నారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు.
న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ వేదికగా మారుస్తూ భారత్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు. 'తెలంగాణ జరూర్ ఆనా' నినాదంతో మన సంస్కృతి, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో 'మిస్ వరల్డ్' పోటీలు నిర్వహించామని సీఎం చెప్పారు.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళుతోందని సీఎం అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించామని, వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతోపాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామని సీఎం తెలిపారు.


Click it and Unblock the Notifications