వెంటనే కస్టమర్‌కి రూ. 30 లక్షలు చెల్లించండి, ఫ్లాట్ ఆలస్యంపై ఇన్ ఫ్రా కంపెనీకి భారీ ఫైన్ విధించిన తెలంగాణ RERA
కొంపల్లిలోని పేట్ బషీరాబాద్‌లో నిర్మాణ సంస్థ 'ది బిల్డింగ్ కో' ద్వారా అభివృద్ధి చేయబడుతున్న టీబీసీ రసజ్ఞ నార్త్ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్న యజమానిపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కొరడా ఝళిపించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారునికి 11 శాతం వార్షిక వడ్డీతో రూ. 30 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 4న తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) ఈ కీలక ఉత్తర్వును జారీ చేసింది. అందులో, ప్రాజెక్ట్ డెవలపర్ 'ప్రీ-లాంచ్ ఆఫర్' ద్వారా నిధులు సేకరించడం చట్ట విరుద్ధం అని పేర్కొంది. కారణం ఏంటంటే, రిజిస్ట్రేషన్ లేదా అమ్మకానికి చెల్లుబాటు అయ్యే ఒప్పందం లేకుండా నిధులు సేకరించడమే. TG RERA ప్రకారం, ఇది రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టాన్ని ఉల్లంఘించడం కావడంతో డెవలపర్‌పై రూ.5 లక్షల జరిమానాను విధించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అథారిటీ స్పష్టం చేసింది.

సికింద్రాబాద్ నివాసి ప్రతీక్ జలాన్ 2019లో ఈ ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి 27, 2020న ఓ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయక ముందే, అతను బ్యాంకు బదిలీల ద్వారా రూ. 15 లక్షలు ముందుగా చెల్లించారు. ఈ ఒప్పంద ప్రకారం ఫ్లాట్ ధరను 1,152 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాకు రూ. 48.3 లక్షలుగా నిర్ణయించారు. GHMC నుంచి మంజూరైన అనుమతి వచ్చినప్పటి నుండి 30 నెలల్లో ఫ్లాట్ డెలివరీ చేయాలని ప్రాజెక్ట్ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.దీనికి 6 నెలల గ్రేస్ పీరియడ్ కూడా ఉంది. GHMC ఫిబ్రవరి 15, 2020న భవన నిర్మాణ అనుమతిని జారీ చేయగా.. గ్రేస్ పీరియడ్‌తో ఫ్లాట్ స్వాధీన గడువు ఆగస్టు 14, 2023న ముగిసింది.
ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2020లో TG RERA రిజిస్ట్రేషన్ పొందినప్పటికీ, ఫిర్యాదుదారు తెలిపినట్లుగా సవరించిన అవగాహన ఒప్పందం, ఆగస్టు 2023లో సంతకం అయిన అమ్మకపు ఒప్పందం ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపించారు. అయితే డెవలపర్ ఈ షెడ్యూల్‌ను పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ఆలస్యంగా పూర్తి చేశారని తెలిపారు. ఫిర్యాదుదారు ప్రతీక్ జలాన్ TG RERAలో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అతను తన ఫిర్యాదులో పడిన మానసిక వేదన, ఆర్థిక నష్టాలను రెరాకు వివరించారు. COVID-19 మారటోరియం కారణంగా సవరించిన స్వాధీన తేదీ మే 5, 2025 నుంచి వడ్డీ లెక్కించాలని, తనకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని కోరారు.
కేసును విచారించిన రెరా.. డెవలపర్ ప్రమోటర్ సరైన ఒప్పంద ప్రక్రియను పాటించకుండా కేవలం ప్రయోజనాల కోసం అధిక మొత్తంలో అడ్వాన్స్ (10% కంటే ఎక్కువ) కూడా స్వీకరించారని TG RERA తేల్చిచెప్పింది. ఇది చట్ట ఉల్లంఘనని స్పష్టం చేసింది. ప్రమోటర్ ఒప్పందాన్ని అమలు చేయకుండానే 10 శాతం కంటే ఎక్కువ అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించడం తప్పు అన్నది స్పష్టమైంది. దీంతో TG RERA ప్రమోటర్‌పై రూ. 5 లక్షల జరిమానా విధించింది.ఆ జరిమానాను 30 రోజుల్లో TG RERA నిధికి జమ చేయాలని కూడా ఆదేశించింది. భవిష్యత్తులో మరిన్ని ఉల్లంఘనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వాస్తవానికి సవరించిన స్వాధీన తేదీ మే 5, 2025 నుంచి 11 శాతం వార్షిక వడ్డీతో రూ. 30 లక్షల రూపాయలను ప్రతీక్ జలాన్ కు తిరిగి చెల్లించాలని రెరా ఆదేశించింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రెరా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఇలాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టుల బాధితులకు గట్టి న్యాయం సాధించే అవకాశం కల్పిస్తోంది. ప్రజలు తమ హక్కుల కోసం TG RERA వంటి సంస్థలను ఆశ్రయించవచ్చన్న భరోసా కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications