Liquor Sales: తెలంగాణలో సోషల్ డ్రింకింగ్ అనేది సర్వసాధారణం. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు కలిసి ఇళ్ల వద్ద సెలబ్రేషన్లకు తప్పకుండా ముక్క చుక్క ఉండేలా చూసుకుంటుంటారు.
ఈ క్రమంలో కొత్త ఏడాది వేడుకలను సైతం మందుబాబులు ఘనంగా జరుపుకున్నట్లు ఎక్సైజ్ శాఖ వివరాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు ఒక్కరోజు ముందే తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. డిసెంబర్ 30న ఈ ఏడాది రూ.313 కోట్ల విలువైన అమ్మకాలు నమోదు కాగా గత ఏడాది ఇది రూ.254 కోట్లుగా నిలిచింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు డిసెంబరు 28 నుంచి 31 మధ్య సుమారు రూ.750 కోట్ల నికర అమ్మకాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు.

వాస్తవ లెక్కలను పరిశీలిస్తే తెలంగాణలో డిసెంబర్ 31తో ముగిసిన మూడు రోజుల కాలంలో రూ.658 కోట్లుగా నమోదైంది. పైగా న్యూఇయర్ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచుకునేందుకు వీలు కల్పించింది. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఫుడ్ ఆర్డర్లు సైతం భారీగానే నమోదయ్యాయి. జొమాటో, స్విగ్గీలు సైతం భారీగా ఆర్డర్ల ఫ్లోను చూశాయి.
నూతన సంవత్సర వేడుకలతో స్టార్టప్ కంపెనీలు సైతం భారీగానే ఆర్డర్లు పొందాయి. వివరాల్లోకి వెళితే స్విగ్గీ, జొమాటో, ఓయో రూమ్స్ బుక్కింగ్స్ గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. జొమాటో ఏకంగా 2015 నుంచి 2020 వరకు న్యూఇయర్ సమయంలో అందుకున్న ఆర్డర్ల మెుత్తం కంటే ఎక్కువ ఈ ఏడాది పొందినట్లు సీఈవో దీపేందర్ గోయల్ వెల్లడించారు. అలాగే ఈ క్రమంలో తమ డెలివరీ పార్ట్నర్స్ రూ.97 లక్షలు అందుకున్నట్లు చెబుతూ లవ్ యూ ఇండియా అంటూ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. స్విగ్గీ కూడా భారీగానే ఆర్డర్లు అందుకోగా.. ఓయో రూమ్స్ బుకింగ్స్ ఈ ఏడాది డిసెంబర్ 31న 37 శాతం పెరిగి 6.2 లక్షలకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications