EVల లైఫ్ ట్యాక్స్ మినహాయింపుకు గుడ్‌బై.. ఇకపై బాదుడు షురూ.. అంత శాతం పన్ను కట్టాల్సిందే!
పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వెహికల్స్ తో భర్తీ చేయాలని ఇండియా భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాహన వినియోగదారులకు వివిధ బెనిఫిట్స్ ఆఫర్ చేశాయి. కాగా ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగించేందుకు చర్యలు చేపట్టాయి.
రాష్ట్రంలో ఇ-మొబిలిటీ సెక్టార్ ను ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లకు కొంత వెసులుబాటు కల్పించింది. రోడ్ ట్యాక్స్ నుంచి EVలకు ఇప్పటివరకు మినహాయింపు ఇచ్చింది. కాగా తాజాగా 11-15 శాతం వరకు పన్ను విధించాలని రవాణాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

'గతంలో జీరో రోడ్ ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు ధరను బట్టి లైఫ్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు' అని MG మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలోని పలు కంపెనీలు ఈ విషయాన్ని ధ్రువీకరించగా.. ప్రభుత్వం అధికారులు దీనిపై స్పందించలేదు.
లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుకు అర్హత ఉన్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యపై తెలంగాణ ప్రభుత్వం గతంలో పరిమితిని సైతం విధించింది. సాంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్ ఖర్చులతో పోలిస్తే విద్యుత్ వాహనాల కోసం తక్కువ మొత్తంలో వెచ్చించడం సానుకూల అంశం. కాబట్టి ప్రభుత్వం మద్దతు ఇవ్వనప్పటికీ, వినియోగదారులు EVల వైపు మొగ్గుచూపుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రిక్ కార్లపై రోడ్డు పన్ను జూన్‌లో అమల్లోకి వచ్చిందని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ షోరూమ్ మేనేజర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వాహనం వివరాలు RTA పోర్టల్ లో అప్ లోడ్ చేసిన తర్వాత వాహనానికి వర్తించే లైఫ్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా చూపిస్తున్నట్లు చెప్పారు. 10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ప్రైస్ కార్లకు 11 శాతం, 10-20 లక్షల్లోపు అయితే 14, 20 లక్షలక కంటే ఎక్కువ ఉంటే 15 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications