GST: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వివిధ పెద్ద రాష్ట్రాలు సైతం అందుకోలేని ఫీట్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. కరోనా మహమ్మారి వంటి అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను సైతం ధీటుగా ఎదుర్కొని ఔరా అనిపిస్తోంది. GST వసూళ్లలో చూపిన వృద్ధే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ప్రకారం.. తెలంగాణ GST ఆదాయం 2018-19లో దాదాపు 29 వేల కోట్లుగా ఉంది. 2022-23 నాటికి ఇది 42 వేల కోట్లకు పెరిగింది. అంటే గత 4 ఏళ్లలో 13 వేల కోట్లకు పైగా వృద్ధి సాధించిందన్నమాట. తద్వారా GST వసూళ్లలో 69 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని స్పష్టమవుతోంది.

కరోనా వ్యాప్తి వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ, GST వసూళ్లలో తెలంగాణ జోరు కొనసాగించింది. లాక్‌డౌన్ సమయంలోను, తదనంతరం కూడా మునుపటి వృద్ధి పథాన్ని ఫాలో అయింది. ఈ విధంగా తెలంగాణ సుస్థిరాభివృద్ధి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బలమైన ఆర్థిక విధానాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బడ్జెట్ అంచనాలతో పోలిస్తే గత నాలుగేళ్లలో ఒకసారి మినహా అన్నిసార్లు 90 శాతానికిపైగా GST వసూళ్లు సాధించింది. 2019-20లో 31 వేల కోట్లు రాబడి అంచనా వేయగా, అందులో 28 వేల కోట్లు అంటే 90 శాతం రాబట్టింది. ఇదే విధంగా 2020-21లో 80, 2021-22లో 97 సాధించి స్థిరమైన వృద్ధిని కనబరిచింది. 2022-23లో అయితే 42.18 వేల కోట్ల అంచనాలో 41.88 రాబట్టి దాదాపు 100 శాతానికి చేరువైంది.
పటిష్ఠమైన ఆర్థిక వ్యూహంతో, ఆర్థిక వనరుల సమర్ధవంతమైన వినియోగంతో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ అద్భుత ఫలితాలు సాధించడంలో వాణిజ్య పన్నుల శాఖ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. వివిధ సంస్కరణలు ప్రేవేశపెట్టడంతో పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది. తెలంగాణ అమలు చేసిన సంస్కరణలు అధ్యయనం చేయడానికి గుజరాత్, UP వంటి రాష్ట్రాలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications