తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ .. రూ, 3, 745 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న MNC కంపెనీలు
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగానికీ పెద్ద ఊతం లభించనుంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub-Committee on Industrial Promotion) తాజాగా మూడు బహుళజాతి కంపెనీల నుండి వచ్చిన రూ.3,745 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,518 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి Telangana ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు తెలంగాణ పెరుగుతున్న ఆకర్షణగా మారింది. బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీని వల్ల యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. అదే సమయంలో రైతులకు కూడా ప్రత్యక్షంగా లాభం చేకూరుతోందని అన్నారు.

హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్: సిద్దిపేట జిల్లాలో రూ.2,398 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ మామిడి, నారింజల వంటి పండ్లకు విస్తృతమైన డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఫలితంగా స్థానిక పండ్ల రైతులు నేరుగా లాభపడతారని అధికారులు మల్లు వెల్లడించారు.
JSW UAV లిమిటెడ్: మహేశ్వరంలో రూ.785 కోట్ల పెట్టుబడితో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 364 మంది యువతకు ఉపాధి లభిస్తుంది. తెలంగాణను డ్రోన్ టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో ఇది కీలకంగా మారనుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్: రూ.562 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ మరియు బుషింగ్‌ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 554 ఉద్యోగాలు వస్తాయి. ఇది తెలంగాణలో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందన్నారు.
కోకా-కోలా ప్రాజెక్ట్ తెలంగాణ రైతుల ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్‌ను అందించనుంది. ముఖ్యంగా మామిడి, నారింజ పండ్ల రైతులకు మంచి ధరలు, నిరంతర డిమాండ్ లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయం-పరిశ్రమల మధ్య సంబంధాన్ని బలపరచడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల ఆదాయాన్ని కూడా పెంచనుందని అంచనా వేస్తున్నారు.
ఈ పెట్టుబడుల వల్ల రెండు ప్రధాన లాభాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అవేంటంటే.. రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టవుతాయి. రైతులకు స్థిరమైన మార్కెట్ లభిస్తుంది. ఇది రాష్ట్రం అనుసరిస్తున్న సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి దృక్పథానికి అనుగుణంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
క్యాబినెట్ ఉపసంఘం ఇటీవల దావోస్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను కూడా సమీక్షించింది. అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని ANI నివేదిక తెలిపింది.


Click it and Unblock the Notifications