తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ బృందం జపాన్ పర్యటనలో తొలిరోజే టోక్యోకు చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మారుబేని కార్పొరేషన్ నుండి రూ.1,000 కోట్ల పెట్టుబడిని సాధించింది. ఏప్రిల్ 16 నుండి 22 వరకు ఏడు రోజుల పాటు సాగే ఈ పర్యటన లక్ష్యం తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే.

ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక పారిశ్రామిక పార్కును నెలకొల్పడానికి మారుబేని కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్ - ఎల్‌ఓఐ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం మారుబేని దశలవారీగా రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాలలో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తుంది. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా జపాన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరో రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేస్తున్నారు.
ఈ పారిశ్రామిక పార్కు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి అత్యాధునిక తయారీ రంగాలపై దృష్టి సారిస్తుంది. తద్వారా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఇంకా స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుంది.
ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి పారిశ్రామిక పార్కులలో మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పార్కు ద్వారా దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని, దీని ద్వారా ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు తెలంగాణ పారిశ్రామిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యాపారం చేయడానికి మారుబేనికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో మారుబేని భాగస్వామి కావడం గర్వకారణమన్నారు.
మారుబేని కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లైఫ్ స్టయిల్, ఫుడ్, వ్యవసాయం, మైన్స్, మెటల్స్, ఎనర్జీ అండ్ కెమికల్స్, విద్యుత్ ఇంకా మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్ సహా రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి అనేక రంగాలలో ఈ సంస్థకు బలమైన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులు మారుబేనిలో పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications