తెలంగాణలో వాహనం కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. లైఫ్ ట్యాక్స్ పెంపు.. మొత్తం నాలుగు శ్లాబులుగా విభజన
lifetime tax on new vehicles: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగానే ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున మూడు శాతం మేర పన్నులను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ పెరిగిన పన్నులు అమల్లోకి రానున్నాయి. వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా వీలైనంత మేర పన్ను ఆదాయం పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఆ పెంపు మొత్తంపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తెలపాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించిన విషయం విదితమే.

తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్టం-1963 ప్రకారం వాహనాల జీవితకాల పన్నుల్లో మార్పులు చేస్తున్నట్టు ఆయన ఉత్తర్వుల్లో తెలిపారు. కొత్త శ్లాబుల ప్రకారం ఎక్స్ షోరూం ధర రూ. 1 లక్ష లోపు ఉన్న ద్విచక్రవాహనాలు, రూ. 10 లక్షల లోపు ధర కలిగిన కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలు ఈ పెంపు ప్రభావం నుండి మినహాయింపు పొందాయి. ఈ శ్రేణికి పైబడిన వాహనాలపై మాత్రం కొత్త పన్ను శ్లాబులు అమలు చేయనున్నారు.ప్రస్తుతం వాహనం ధర రూ. 50 వేల లోపు, వాహనం ధర రూ.50 వేల కంటే ఎక్కువ ప్రస్తుతం ఈ రెండు శ్లాబులు మాత్రమే అమలులో ఉన్నాయి. ఆ రెండు శ్లాబులకు నిర్ధారిత జీవితకాల పన్ను కూడా ఫిక్స్ చేశారు. తాజాగా వాహన ధర శ్లాబులను నాలుగుకు పెంచారు. వాహన విలువ రూ.50 వేల లోపు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు , రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, రూ.2 లక్షల కంటే ఎక్కువ ఇలా నాలుగు శ్లాబులుగా విభజించారు.
రవాణా శాఖ వివరాల ప్రకారం, ఎక్కువ ధర గల వాహనాలకు సంబంధించి పన్ను రేట్లు పెంచడంతో.. అధిక వర్గానికి చెందిన వినియోగదారులు ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త శ్లాబులు అమల్లోకి వస్తే, లగ్జరీ కార్లు, ప్రీమియం SUVలు, అధిక ధర గల బైక్‌ల రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో సుమారు 70 శాతం జీవితకాల పన్నుల (Lifetime Tax) నుంచే వస్తోంది. తాజా పన్ను పెంపుతో అదనంగా రూ. 2,000 కోట్లు వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అదనపు ఆదాయం రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారి మరమ్మతులు, వాహన రవాణా సంబంధిత సేవల మెరుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications