Bike Taxi: ఓలా, ఉబర్‌లకు దిమ్మతిరిగే షాకిచ్చిన తెలంగాణ.. ఈ దెబ్బతో భారీగా తగ్గనున్న ఛార్జీలు
Mana Yatri App: పెద్ద నగరాలు సహా చిన్న పట్టణాల వరకు రైడ్ షేరింగ్ యాప్స్ అగ్రిగేటర్ల హవా కొనసాగుతోంది. ఒక క్లిక్ తో నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకుని చాలా ఈజీగా ప్రయాణాలు సాగించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ ముసుగులో అటు డ్రైవర్లు, ఇటు ప్యాసింజర్ల నుంచి ఈ తరహా సంస్థలు పెద్ద మొత్తంలో కమీషన్లు దోచేస్తున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ దోపిడీకి చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం టీ హబ్ ద్వారా 'మన యాత్రి' పేరిట తెలంగాణ సర్కారు ఓ యాప్ క్రియేట్ చేసింది. ఆటో వాలాలు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు టీ హబ్ CEO శ్రీనివాస్ తెలిపారు. ఓలా, ఉబర్ తరహా రైడ్ షేరింగ్ యాప్స్ కంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో యూజర్లు, ఆటో వాలాల నుంచి భారీ స్థాయిలో కమీషన్ దోచే అవకాశం ఉండదు. తద్వారా ప్రయాణాలకు వెచ్చించే మొత్తం కూడా తగ్గుతుంది.

ఈ తరహా సర్వీసులు ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాదులోనూ ఈ సేవలు ప్రారంభం కావడంతో.. గతంలో మాదిరిగా డ్రైవర్లతో ప్రయాణీకులు బేరం ఆడి మరీ ఛార్జీలు తగ్గించుకొనే వెసులుబాటు లభిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా తమ పొట్ట కొట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో వాలాలకు ఇది ఒక వరంగా చెప్పవచ్చు.
ఓలా, ఉబెర్ వంటి సంస్థలకు మాత్రం ఇది గట్టి షాక్ గా భావిస్తున్నారు. నగరంలో వారి గుత్తాధిపత్యానికి శుభం పలికేలా కొత్త సీఎం నిర్ణయం తీసుకున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకొన్నందుకు సంతోషపడుతున్నారు. ఇతర యాప్స్ మాదిరిగా ఇందులోనూ వినియోగదారులు UPI లేదా నగదు ద్వారా పేమెంట్స్ జరపవచ్చని టీ హబ్ చెబుతోంది.


Click it and Unblock the Notifications