Telanganaలో ఎలక్ట్రిక్ వాహనం కొనేవారికి శుభవార్త.. ఆ టాక్సులు 100 శాతం మాఫీ..!!
Electric vehicles: దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ప్రేరేపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తారా స్థాయిలకు చేరిన వేళ ఇలాంటి పరిస్థితులు తగ్గించటం, ఉద్ఘారాల స్థాయిలను తగ్గించేందుకు ప్రజలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ఈవీ కొనుగోలుదారుల కోసం భారీ ఊరటను ప్రకటించింది. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100 శాతం రాయితీని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 31, 2026 వరకు అమలులోనే ఉంటుందని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ జీవో నెం-41 ప్రకారం నవంబర్ 18, 2024 నుంచి కొత్త ఈవీ విధానం అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలనే లక్ష్యంతో తీసుకున్నదని ప్రభుత్వం వెల్లడించింది.

జీవో ప్రకారం ఏఏ రకాల వాహనాలకు ఈ వెసులుబాటు అందించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. టూవీలర్స్, ఫోర్ వీలర్స్, టాక్సీలు, ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ త్రీ-సీటర్ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్‌ల వంటి వాణిజ్య ప్రయాణ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుండి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జీవో ప్రకారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ బస్సులు సైతం పరిగణలోకి తీసుకోబడతాయని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా నిర్వహించబడే ఎలక్ట్రిక్ వాహనాలకు, వారి స్వంత ఉద్యోగులను ప్రత్యేకంగా రవాణా చేయడానికి, వాణిజ్యానికి ఉపయోగించని ఏదైనా పరిశ్రమకు చెందిన బస్సులకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేయబడింది. రిజిస్టర్డ్ వాహనాల సంఖ్యతో సంబంధం లేకుండా డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి తెలంగాణలో కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని సర్కార్ వెల్లడించింది. ఇది తెలంగాణలో ప్రజలు వాణిజ్య సంస్థల నుంచి ఈవీ వాహనాలకు భారీగా డిమాండ్ పెంచవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ఇంధన ఖర్చులను తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ హితమైన రవాణా ఎంపికలకు ప్రాధాన్యం ఇస్తున్న వేళ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం రావటంపై ఈవీ పరిశ్రమ సైతం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎకానమీలో వ్యాపార పెరుగుదలకు ఇది దోహదపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications