Rameshwaram Cafe: మరోసారి వార్తల్లో నిలిచిన రామేశ్వరం కేఫ్.. మార్చిలో బాంబ్ పేలుడుతో, ఇప్పుడేమో..
Hyderabad News: ఈ ఏడాది మార్చిలో బెంగుళూరు బాంబు పేలుడు ఘటనతో రామేశ్వరం కేఫ్ మరింత మందికి పరిచయమైంది. కాగా హైదరాబాద్‌లోని అదే హోటల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడు ముష్కరుల దుశ్చర్యకు బాధితురాలు కాగా ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడింది. వ్యాపారమే పరమావధిగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గతకొన్ని రోజులుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు భాగ్యనగరంలోని హోటళ్లను వణికిస్తున్నారు. భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ QSR చైన్ రామేశ్వరం కేఫ్ హైదరాబాద్ అవుట్‌లెట్‌పై కూడా తెలంగాణ ఫుడ్ సేప్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను వంటకాల్లో ఉపయోగించడం సహా రామేశ్వరం కేఫ్ పలు భద్రతా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు సోదాల్లో తేలినట్లు సమాచారం. అక్కడ స్వాధీనం చేసుకున్న ఫుడ్ స్టాక్‌లో 100 కిలోల కందిపప్పు, 10 కిలోల పెరుగు మరియు ఎనిమిది లీటర్ల పాలు ఎక్స్‌పైరీ అయినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అవేకాక 450 కిలోల ముడి బియ్యం, 300 కిలోల బెల్లంతో పాటు లేబుల్ లేని పదార్థాలను కూడా ఫుడ్ సేప్టీ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది.
రెస్టారెంట్‌లో ఫుడ్ హ్యాండ్‌లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని తేలింది. బాహుబలి కిచెన్ FSSAI లైసెన్స్ ట్రూ కాపీని ప్రదర్శించడంలోనూ విఫలం కావడంతో యాజమాన్యంపై విమర్శలు చెలరేగాయి. ఇక వంటగదిలో బొద్దింకలు ఉండగా.. పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా సరిగా లేవని తెలుస్తోంది. డస్ట్‌బిన్‌లను సైతం సరిగ్గా కవర్ చేయలేదని అధికారులు గుర్తించారు. అయితే ఈ రెస్టారెంట్‌ను గత జనవరిలోనే మాదాపూర్ ప్రాంతంలో ప్రారంభించడం విశేషం.


Click it and Unblock the Notifications