Cadbury News: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే చాక్లెట్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగులు కనిపించిన ఉదంతంపై రాష్ట్ర ఫుడ్ లేబొరేటరీ పరీక్షలు నిర్వహించింది. అందులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని ప్రముఖ రిటైల్ దుకాణం రత్నదీప్ నుంచి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల క్యాడ్‌బరీ చాక్లెట్ బార్‌లో కొనుగోలు చేశాడు. అందులో పురుగు కనిపించడంతో తెలంగాణ స్టేట్ ఫుడ్ లేబొరేటరీ చాక్లెట్ శాంపిల్ కలెక్ట్ చేసింది. దానిని పరీక్షించగా అందులో తెల్ల పురుగులు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రొడక్టుకు సంబంధించి విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది.

సంఘటనకు సంబంధించి వినియోగదారుని ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించి, అదే బ్యాచ్ నుంచి నమూనాలను సేకరించడం ద్వారా చర్యలు తీసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా విశ్లేషించడం కోసం తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు.
దాని నివేదిక ప్రకారం.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ (రోస్ట్ ఆల్మండ్) నమూనా తెల్ల పురుగులు సహా ఇతర క్రిములతో కలుషితమైందని తేలింది. తద్వారా ఆహార భద్రత & ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం అది వినియోగానికి సురక్షితం కాదని తేల్చింది. అదనంగా తేమ శాతం, కొవ్వు, చక్కెర మరియు సింథటిక్ ఫుడ్ కలర్‌ల స్థాయిలను పరీక్షించింది. చక్కెర పరీక్ష సానుకూల ఫలితాన్ని ఇవ్వగా.. సింథటిక్ ఫుడ్ కలర్ లేదని పేర్కొంది.
చాక్లెట్ ఉత్పత్తుల ప్రమాణాల ప్రకారం 25 శాతం కంటే తక్కువ కొవ్వు, 0.2 శాతం కంటే ఎక్కువ యాసిడ్ ఇన్‌సాల్యుబుల్ యాష్, పురుగులు వంటి ఇతర పదార్థాలు లేకపోవడం తప్పనిసరి. అయితే విశ్లేషించబడిన నమూనా ఈ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఇది వినియోగానికి సురక్షితం కాదని అధికారులు తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications