Cyber Crime: ప్రతిఒక్కటి ఇప్పుడు ఆన్ లైన్ అయిపోయిన తర్వాత యూజర్ల డేటాను తస్కరించి అమ్మేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని పట్టుకోవటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ ముఠా వద్ద దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన దాదాపు 66.9 కోట్ల మంది డేటాను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ భరద్వాజ్ వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్టీవో కార్యాలయాల నుంచి, ఎడ్ టెక్ కంపెనీలైన బైజూస్, వేదాంతు వంటి సంస్థల నుంచి డేటాను సేకరించేవాడు. దీనికి తోడు నిందుతుడు Amazon, Netflix, Youtube, Paytm, Phonepe, Big Basket, BookMyShow, Instagram, Zomato, Policy Bazar, Upstoxతో పాటు అనేక ఇతర యాప్ యూజర్ల డేటాను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందుతుల వద్ద కేవలం సాధారణ పౌరులకు సంబంధించిన వివరాలు మాత్రమే కాక రక్షణ శాఖ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పాన్ కార్డ్ హోల్డర్లు, 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల డేటా, సీనియర్ సిటిజన్లు, ఢిల్లీ విద్యుత్ వినియోగదారులు, డి-మ్యాట్ ఖాతాదారులకు చెందిన సమాచారం కలిగి ఉన్నారు. ఇదే సమయంలో నిందితుల వద్ద ధనికులు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ హోల్డర్లు, నీట్ విద్యార్థుల ఫోన్ నంబర్లను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

ఈ నిందుతుడు తన దందాను హర్యాణాలోని ఫరీదాబాద్ కేంద్రంగా "InspireWebz" అనే వెబ్ సైట్ ద్వారా నిర్వహిస్తున్నాడు. తన దగ్గర ఉన్న మెుత్తం డేటాను 135 కేటగిరీలుగా విభజించి వాటిని వివిధ క్లౌడ్ డ్రైవ్ లింక్స్ ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. నిందుతుడు అమెర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి డేటాబేస్లను సేకరించాడు. పాన్ కార్డు డేటా కూడా వీరివద్ద దొరికింది. దీనిపై ఐటీ చట్టాల ఉల్లంఘించిన కింద సంబంధిత సంస్థలకు నోటీసులు అందజేస్తామని.. సైబరాబాద్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కల్మేశ్వర్ శింగెనవర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications