తెలంగాణ బడ్జెట్ 2026: ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు కేటాయింపు.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే..
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3,24,234 కోట్ల అంచనాతో రూపొందించబడింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 50,713 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో ప్రధానంగా:
రైతు భరోసా - రూ. 18,000 కోట్లు
చేయూత - రూ. 14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్ళు - రూ. 5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం - రూ. 4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్ - రూ. 3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) - రూ. 2,080 కోట్లు
తదితర కేటాయింపుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ. 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సబ్సిడీకి రూ. 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 600 కోట్లు కేటాయించారు. అలాగే పవర్ సబ్సిడీ కోసం రూ. 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీ కోసం రూ.3,000 కోట్లు, కల్యాణలక్ష్మి / షాది ముబారక్ కోసం రూ. 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలు కోసం రూ. 2,170 కోట్లు, స్కాలర్‌షిప్‌లు కోసం రూ. 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చులు కోసం రూ. 2,323 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

అంతేకాక, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటీ 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందని.. జూన్ 2 నుండి అమలు జరుగుతుందని తెలిపారు.
విద్యార్ధుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్ధుల వరకు నూతన బ్రేక్‌ఫాస్ట్ పథకంను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్ధుల కోసం మధ్యాహ్న భోజన పథకంను జూనియర్ కాలేజీలలో అమలు చేయనున్నట్లు చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్ వాహనాలు అందించడానికి, సంక్షేమ పాఠశాలల వసతులను మెరుగుపర్చడానికి రూ. 100 కోట్లు కేటాయించబడ్డాయి.
విద్యా రంగంలో, రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 15 కొత్త కోర్సులు ప్రవేశపెడతారని, అలాగే స్కిల్ యూనివర్సిటీని విద్యా శాఖ పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పౌరుని సామాజిక, ఆర్థిక న్యాయం ద్వారా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది, రైతు, విద్యార్థి, మహిళా, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు.


Click it and Unblock the Notifications