తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana Budget 2026) లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి మ్యాప్ ను మూడు విభాగాలుగా విభజించి వాటికి క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్(RARE) అని పేర్లు పెట్టారు. వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి.. అభివృద్ధిని కేవలం నగరాలకే పరిమితం చేయకుండా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చేలా మూడు ప్రధాన జోన్లను ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను CURE, PURE, RARE అనే మూడు విభాగాలుగా విభజించి, ప్రణాళికాబద్ధమైన వృద్ధికి శ్రీకారం చుట్టారు.

CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతాన్ని 'CURE' జోన్‌గా ప్రభుత్వం గుర్తించింది. 2031 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకోనున్న నేపథ్యంలో, ఈ ప్రాంతాన్ని హై-వాల్యూ సర్వీసెస్ హబ్‌గా మార్చనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ , స్టార్టప్‌లకు ఇది చిరునామాగా మారనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ను కాలుష్య రహిత (Net Zero) నగరంగా మార్చడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలుగా (Retrofitting) మార్చనుంది. అలాగే, కాలుష్య కారక పరిశ్రమలను ORR వెలుపలకు తరలించనున్నారు.
PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ)
ఔటర్ రింగ్ రోడ్ (ORR) , ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న ప్రాంతాన్ని 'PURE' జోన్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనిని తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు 'మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజిన్' గా అభివర్ణించారు. ఇక్కడ భారీ తయారీ పరిశ్రమలు, MSME క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు , ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే ఈ జోన్ ప్రధాన ఉద్దేశ్యం.
RARE (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ)
ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) అవతల ఉన్న గ్రామీణ ప్రాంతాలను 'RARE' జోన్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఇక్కడ వ్యవసాయం , దాని అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం (Value-added Agriculture) , ఎకో-టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం పెరగడమే కాకుండా, పట్టణాలకు వలసలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. పల్లెల్లో కూడా పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకురావడం ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని బడ్జెట్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ CURE, PURE, RARE వ్యూహం రాష్ట్ర భవిష్యత్తును మార్చేసేలా కనిపిస్తోంది. సాంకేతికత, తయారీ రంగం , వ్యవసాయాన్ని వేర్వేరు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడం వల్ల పాలనలో స్పష్టత రావడమే కాకుండా పెట్టుబడులు కూడా ఆయా రంగాలకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వినూత్న ప్రయోగం సత్ఫలితాలనిస్తే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం. రేవంత్ సర్కార్ ఆశించిన ఈ 'విజన్-2047' లక్ష్యం దిశగా ఈ బడ్జెట్ ఒక బలమైన అడుగు అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications